- ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు పన్ను మినహాయింపునివ్వాలి
- సినిమా చూసిన కేంద్ర సహాయ మంత్రి సంజయ్
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): గోద్రా ఘటనను తప్పుడుగా చిత్రీక రించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కుట్రలను ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా బట్టబయలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సినిమాకు రాష్ర్ట ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు.
అద్బుతమైన సినిమాను అందించిన దర్శక నిర్మాతలకు, సినీ నటీనటులకు ప్రత్యేక అభినందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం హైద రాబాద్‌లోని జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ది సబర్మతి రిపోర్ట్ అద్బుతమైన సినిమా అని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రను వక్రీకరించి అర్థం పర్థంలేని విషయాలను జోడిం చి వాస్తవాలను తెరమరుగు చేసేందుకు యత్నించిందని ఆరోపించారు. కరసేవకుల హత్యకు చేసిన కుట్రనే గోద్రా ఘటన అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఒక సెక్షన్ మీడియా కావాలని ప్రజల దృష్టి మళ్లించాయని విమర్శించారు.
కరసేవకుల రైలులో సిలిండర్, గ్యాస్ స్టవ్ పేలిందని దుష్ర్పచారం చేశారని ఈ సినిమాతో వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు. నేటికీ సత్యం బయటకు రాకుండా కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నిత్యం వాస్తవాలను వక్రీక రించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ సంబురాలు చేసే వాళ్లున్నారని.. ఇండియా గెలవొద్దని కోరే వాళ్లూ ఉన్నారని అన్నారు.
చాలాచోట్ల మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్ వంటి కాలనీలున్నాయంటే ఎవరు మారాలో అర్థం చేసుకో వాలన్నారు. ఇప్పటికైనా సమాజం మారాలని, వాస్తవాలను సమాజం గుర్తించి స్పం దించాలని కోరారు. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ర్ట కోశాధికారి శాంతికుమార్, అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జె.సంగప్ప తదితరులు కేంద్ర మంత్రితో కలిసి సినిమా చూశారు.