calender_icon.png 20 October, 2024 | 5:26 AM

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర

28-07-2024 05:24:53 AM

  1. పిల్లర్లు కుంగాయని కావాలని ఆరోపణలు 
  2. లక్షల క్యూసెక్కుల ప్రవాహానికీ చెక్కు చెదరలేదు 
  3. ఎన్నికల ముందే ఎలా కుంగుతుంది? 
  4. విఫల ప్రాజెక్టుగా చూపాలని విఫలమయ్యారు 
  5. మా విజయాలను ప్రచారం చేసుకోలేకనే ఓడిపోయాం 
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం బీఆర్‌ఎస్ ఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కు చెదరని బరాజ్ ఎన్నికల ముందు ఎలా కుంగుతుందన్నారు. మున్ముందు బరాజ్‌కు ఏం జరిగి నా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయని, వారు బరాజ్‌కు ఏమైనా చేయగలర న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదన్నారు.

ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమేనని, కానీ 2 టీఎంసీలు నీరు ఎత్తి పోస్తే సరిపోదని సూచించారు. కన్నెపల్లి పంపు హౌజ్ నుంచి నీళ్లు ఎత్తి పోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోందని పేర్కొన్నారు. తాము మేడిగడ్డ సందర్శనకు వెళ్లినప్పుడు 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా బరాజ్ తట్టుకుని నిలబడిందని స్పష్టం చేశారు. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారని, ప్రాజెక్టుపై ఇచ్చింది ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు కాదని, అది ఎన్‌డీఏ రిపోర్టు అని ఎద్దేవా చేశారు.

పోలవరం కాపర్ డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. 90 టీఎంసీల నీరు గోదావరిలోకి వృథాగా పోతుందని, 90 టీఎంసీలంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో సమానమని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కోరారు. ఎల్లంపల్లిలో 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, పద్నాలుగు టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు నిల్వ ఉంచగా రెండు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉందన్నారు. ఎల్లంపల్లి నీళ్లు మిడ్‌మానేరు, మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవని, కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. 

మూసీ రూ.1.50 కోట్లు కావాలా?

ఇప్పటికే రాష్ట్రంలో 40 శాతం లోటు వర్షపాతం ఉందని, కాళేశ్వరం కరువుకు ఇన్స్యూరెన్స్ లాంటిదని కేటీఆర్ అన్నారు. నీటి లిఫ్టింగులకు విద్యుత్ ఖర్చు అయినా రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఖర్చు ముఖ్యమా అని ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల్లో తాగునీళ్ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తారని, కాళేశ్వరంలో నీళ్లున్నప్పుడే ఖాళీగా ఉన్న ప్రాజెక్టులను నింపి పెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం నిర్వహణకు డబ్బులవుతు న్నాయని బాధ పడుతున్న కాంగ్రెస్ ప్రభు త్వం మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు మాత్రం రూ.1.50 లక్షల కోట్లు అవసరమవుతుందనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది ఎవరికి లాభమని, అవినీతి కోసమే ఈ ప్రాజెక్టా అని ప్రశ్నించారు. ఆగస్టు 2 తర్వాత కేసీఆర్‌తో చర్చించి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బరాజ్ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నట్టు పేర్కొన్నారు. 

ప్రచారం చేసుకోలేకనే ఓడాం...

తాము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగా ప్రచారం చేసుకోలేక పోయామని, అందుకే ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో అలైన్‌మెంట్‌ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం సీఎం ఇంకా ప్రతిపక్ష నేత అనే మూడ్‌లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎల్‌అండ్‌టీ గురించి సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగాలే దని, ఈ ధోరణి పెట్టుబడిదారులకు తప్పు డు సందేశం వెళ్లేలా చేసిందన్నారు. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి అన్నింటిలో స్కాములే కనిపిస్తాయని, బతుకమ్మ చీరల పంపిణీతో సహా దేనిలోనైనా విచారణ చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్‌తో ఏ సీఎం అయినా పోలుస్తారా?  ఇంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా అని విమర్శించారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టులో రెయిల్ కారిడార్ ఉందని, భూసేకరణలో ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఎయిర్‌పోర్టుకు ఆ మార్గంలో మెట్రో విస్తరణ ప్రతిపాదించామని స్పష్టం చేశారు. పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, రేవంత్‌రెడ్డికి పేర్లు మార్చే పిచ్చి ఉందని విమర్శించారు. 

షాడో కేబినెట్ నడుస్తుంది

సీఎం సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి ఏం చేస్తున్నారో తమకు తెలు సని, అవసరమైనపుడు అన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఉదయ సింహా, ఫహీమ్ ఖురేషి, అజిత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి షాడో కేబినెట్ నడుతుపుతున్నారని ఆరోపించారు. ధరణి స్థానంలో ఏది వచ్చినా భూ మేతే అవుతుందన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం పది రెట్లు పెంచి ఏం చేస్తారో భవిష్యత్తులో చూద్దామన్నారు. ఈ ప్రభుత్వం పరిపాలనలో ఐదేళ్ల సమయాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెడతారనే విషయంపై ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో విడుదల చేసిన పత్రంలో శోధించి.. సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఉదయ్ స్కీం గురించి పత్రం విడుదల చేసి మోటార్లకు మీటర్ల సంబంధించిన ఒప్పందం అని రేవంత్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని, మోటార్లకు మీట ర్ల నిబంధన కరోనా సమయంలో కేం ద్రం పెట్టిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.