calender_icon.png 5 November, 2024 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న రాష్ట్రానికి కాంగ్రెస్ కమిటీ!

05-07-2024 01:16:22 AM

తక్కువ ఎంపీ సీట్లు రావడంపై విశ్లేషించనున్న పార్టీ

ఎన్నికల్లో నేతల కృషిపై వివరాలు సేకరించి నివేదిక

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు  అనుకున్న సీట్లు రాకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. మూడు రోజులపాటు ఇక్కడే ఉండి పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారం సేకరించి ఏఐసీసీకి  నివేదిక అందజేయనుంది. రాష్ట్రం లో వాస్తవాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీజే కురియన్ నేతృత్వంలో రాకిబుల్ హుస్సేన్, ప్రగతిసింగ్‌తో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రానికి వచ్చి పార్టీ కోసం, అభ్యర్థుల విజయం కోసం పూర్తిస్థాయిలో సమయం కేటాయించి పనిచేసిన వారు ఎవరు? విస్మరించిందెవరు అనే విషయాలపై సమగ్ర విషయాలను ఆరా తీయనుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లకుగాను కనీసం 14 సీట్లలో విజయం సాధించాలని భావించింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అనుకున్న విధంగా సీట్లు రాకపోవడంతో కేంద్రంలో అధికారం చేజారిందనే భావనలో ఢిల్లీ పెద్దలున్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా తక్కువ సీట్లు రావడం, బీజేపీకి ఊహించన దానికంటే ఎక్కువగా ఎంపీ సీట్లు గెలవడంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతోనే ఫలితాలు ఇలా వచ్చాయని భావిస్తున్నారు. కురియన్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పదవుల పంపకం చేయనున్నారని సమాచారం.