calender_icon.png 7 October, 2024 | 6:00 AM

ప్రతిపక్షాలకు కాంగ్రెస్ చెక్

07-10-2024 01:55:02 AM

మూసీ పరీవాహక రైతులతో ఆందోళనకు వ్యూహం

బీఆర్‌ఎస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా హస్తం స్కెచ్

మూసీతో ప్రజల అనారోగ్య సమస్యలపై విస్తృత ప్రచారం  

హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి ప్రజల్లో చైతన్యానికి కార్యాచరణ

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్, బీజేపీలో ఆందోళనలు చేస్తుంటే.. జిల్లాలలో ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతోంది.

దీంతో ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడికి చెక్ పెట్టాలని చూస్తోంది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను పార్టీతోనే సమాధానం చెప్పించాలని స్కెచ్ వేశారు. మూసీ ప్రక్షాళన అంశంతో రెండు రకాలుగా లాభం పొందాలనే ఆలోచనతో హస్తం పార్టీ పథక రచన చేస్తున్నది. మూసీ ప్రక్షాళన జరిగితే  కాంగ్రెస్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.

వివిధ రకాలు ప్రజలతో కనెక్ట్ కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందనే భావనలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చాక ప్రజల్లో విద్వేషాలను పెంచుతున్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 

మూసీ పరీవాహక రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నం 

మూసీ సుందరీకరణను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే మూసీ వెంట సర్వేను చేపట్టి, నిర్వాసితులకు పునరావసం కూడా కల్పిస్తోంది. అయితే, ప్రతిపక్ష నాయకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కాకుండా పేదల ఇళ్లను కూల్చుతోందని, ఇది బుల్డోజర్ సర్కార్ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మూసీ వెంట ఉన్న ప్రజలతో సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నంలోనే పార్టీలు రాజకీయాలు మొదలు పెట్టాయి. దీనిని గమనించిన కాంగ్రెస్ రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మూసీ నది పరివాహాక ప్రాంతాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తుంది.

కాలుష్యంపై అక్కడి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి, ఆందోళనలు ఉద్ధృతం చేసేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరో వైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నమూ చేస్తున్నారు.

ముందుగా మూసీ వల్ల ఇబ్బందులు పడుతున్న జిల్లాల్లో మూసీ ప్రక్షాళన అవసరాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని, దాని కోసం ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశించినట్టు సమాచారం.

మూసీ వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, మురుగు నీటితో పండుతున్న పంటల వల్ల వస్తున్న సమస్యలను, మూసీ నీటిని తాగడం వల్ల వస్తున్న అనారోగ్య సమస్యలను హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మూసీ ప్రక్షాళన అవసరాన్ని తెలియజేస్తూ కరపత్రాలు, పోస్టర్లు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీ క్యాడర్‌కు దీనిపై అవగాహన పెంచేందుకు అధ్యయన తరగతులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 

రాజకీయ పార్టీలతో సమావేశాలు 

మూసీ ప్రక్షాళన విషయంలో త్వరలోనే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలోగా మూసీ ప్రభావిత ప్రాంతాలైన హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన రైతులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, పర్యావరణ, సామాజిక వేత్తలతో పలు సదస్సులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.

రెండ్రోజుల క్రితం మూసీ ప్రభావిత జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసి.. మూసీ ప్రక్షాళన ఎందుకన్న చర్చను ప్రారంభించారు.

మూసీ ప్రక్షాళన చేయకపోతే ఉమ్మడి నల్లగొండ మురుగు నీటితో కలుషితమై భవిష్యత్‌లో తాగడానికి మంచినీరు లేకుండా చేయాలనే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌పై విమర్శలు వస్తున్నాయి. మూసీ సుందరీకరణ అంశం ఎలాంటి మలులపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.