12-04-2025 01:07:47 AM
ఖమ్మం, ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ):-రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న, వరి పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల, వైరా, ఎన్కూర్ మండలాల వ్యవసాయ పొలాల్లో చోటుచేసుకున్న వాస్తవ పరిస్థితులను బీజేపీ నేతలు స్వయంగా పరిశీ లించారు.
జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్, రాష్ట్ర నాయకుడు చిలుకూరు రమేష్ నేతృత్వంలో బీజేపీ బృందం రైతుల మధ్యకు వెళ్లింది. మొక్కజొన్న, వరి ధాన్యంతో నిండిన పొలాలను పరిశీలించిన నేతలు, రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి బాధలను అర్థం చేసుకున్నారు.
మేము పండించాం... కానీ అమ్మలేక మేమే మునిగిపోతున్నాం అని గుండెను పిండేసేలా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని చోట్ల వర్షం కారణంగా ధాన్యం తడవకుండా రైతులు ట్రాక్టర్ల మీద, ఇంటి ముందర చెట్ల నీడలో దాచిన దృశ్యాలు కనిపించాయి.ఈ దృశ్యాలను చూసిన నేతలు ప్రభుత్వాన్ని తీవ్రంగా ధ్వజమెత్తారు.వర్షాభావం, కూలీల సమస్యలు, ఖర్చుల భారంతో ఇప్పటికే బాధపడుతున్న రైతులు, పంట చేతికి వచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో విలవిలలాడుతున్నారని నేతలు పేర్కొన్నారు.
ఈ పరిస్థితిలో బీజేపీ నాయకులు రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని తెలిపారు. కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కనీస మద్దతు ధర లేకుండా కొనుగోలు జరుగుతుండటంతో రైతులకు నష్టమే మిగులుతోందని వాపోయారు. కొందరు మధ్యవర్తులు ధాన్యాన్ని తక్కువ ధరలకు కొంటున్నారని అన్నారు.
ధాన్యం కేంద్రాల కొరత
పర్యటన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ, పల్లె స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కొరత, మద్దతు ధరపై అవిశ్వాసం, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు పేరుకే ఉన్నాయని, వాటి ద్వారా రైతులకు లాభం కాకుండా అవినీతి పెరిగిందని ఆరోపించారు.ఇంకా ఈ కార్యక్రమంలో మందడపు సుబ్బారావు, చింతనిప్పు రామారావు,ఆర్ విఏస్ యాదవ్,మాధవ్ పాల్గొన్నారు.