అమరావతి,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో రెండుసార్లు ఓడించి సభలోకి రానివ్వకుండా వేదన కలిగించిందన్నారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని గౌరవించింది బీజేపీయేనన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే అంబేద్కర్‌కు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయడం జరిగిందని ఆమె గుర్తు చేశారు.
1989లో వీపీ సింగ్ నేతృత్వంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 1990లో డాక్టర్ అంబేద్కర్‌కు భారతరత్న ప్రదానం చేయబడిందని పురంధేశ్వరి పేర్కన్నారు. సెప్టెంబర్ 24, 1990న సమస్తిపూర్‌లో దాని అధ్యక్షుడు ఎల్కే అద్వానీని అరెస్టు చేసే వరకు బీజేపీ బయటి నుండి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షలకు పైగా ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. విషాద సంఘటన జరగకుండా థియేటర్ వద్ద మరింత భద్రత కల్పించి ఉంటే బాగుండేదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.