31-03-2025 01:43:13 AM
సూర్యాపేట, మార్చి 30: పేద ప్రజల ఆకలి తీర్చేందుకు 2013లో ఆహార భద్రత చట్టాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని పంచాయితీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు.
ఆదివారం హుజూర్నగర్ నందు నిర్వహించే సన్న బియ్యం పథకం ప్రారంభ సభలో పాల్గొనేందుకు వెళుతూ, జిల్లా కేంద్రంలోని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఆ పార్టీ కి ఎందుకు రాలేదో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బిజెపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి లేక మతం పేరుతో, దేవుని పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టాలని చూస్తుందన్నారు.
తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ని తిడితే గుర్తింపు వస్తుందని బండి సంజయ్ ఆలోచన అని, తమ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తుందన్నారు.