06-04-2025 01:02:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): వక్ఫ్ సవరణ చట్టం పీడితవర్గాల ముస్లింలకు న్యాయం చేస్తోందని రాజ్యసభ సభ్యు లు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మ ణ్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు పరిధి లో ఉన్న రూ.1.2 లక్షల కోట్ల విలువైన భూములు అవినీతిపరుల చేతుల్లో అన్యాక్రాంతమవుతున్నాయని, కేంద్రం తీసుకొచ్చిన సవరణల ద్వారా వీటి పూర్తి డాక్యు మెంటేషన్, ఆదాయ
వ్యయాల వివరాలు సెంట్రల్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు పేరుతో పేద ముస్లింల హక్కులను కాలరాస్తూ, వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొంతమంది ముస్లిం పెద్దలు దోచుకుంటున్నందునే కేంద్రం ఈ బిల్లును తెచ్చి పేద ముస్లింలకు అండగా నిలిచిందన్నారు.
ఈ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్రలు చేశాయన్నారు. రాష్ట్రంలోని 77,538 ఎకరాల వక్ఫ్ భూముల్లో 75 శాతం ఆక్రమణకు గురవడం వెనుక కాంగ్రెస్, -బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల అగ్రనాయకుల పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎంకు మద్దతుగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలు అభ్యర్థిని నిలబెట్టకుండా మజ్లిస్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, -బీఆర్‌ఎస్-, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మారాయని పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని పార్లమెంట్‌లో తెలంగాణ బీజేపీ ఎంపీలుగా తాము గళమెత్తామని లక్ష్మణ్ గుర్తుచేశారు.
విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పాలన అందిస్తోందని తెలిపారు. రానున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కొందరి చేతుల్లోనే బందీ..
కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సచార్ కమిటీ.. వక్ఫ్ బోర్డు వార్షిక ఆదాయాన్ని కేవలం రూ.160 కోట్లుగా మాత్రమే చూపిస్తున్నారని, వాస్తవానికి ఇది ఎన్నో రెట్లు ఎక్కువని కమిటీ తేల్చిందన్నారు. కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బడా ముస్లిం నేతలను కాపాడే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
వక్ఫ్ సవరణ చట్టంతో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్యసదుపాయాలు అందేందుకు మార్గం సుగమమైందన్నారు. ఢిల్లీలో రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన మాన్సర్ అనే హోటల్‌ను కేవలం నెలకు రూ.12 వేల అద్దెకు ఇవ్వడంతో కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులు ఎలా నిర్వాహకుల చేతుల్లో బందీ అయ్యాయో స్పష్టమవుతోందన్నారు.
ఈ ఆదాయం అసలు పేద ముస్లింల సంక్షేమానికి, విద్య, ఆరోగ్య అభివృద్ధికి ఉపయోగపడాల్సినవని తెలిపారు. వక్ఫ్ బోర్డులో కొంతమంది పెద్దలు దాన్ని తమ స్వప్రయోజనాల కోసం దారి మళ్లిస్తూ, ప్రజల హక్కులను తాకట్టు పెట్టడం ఈ ఉదాహరణతో స్పష్టమవుతోందన్నారు.