గాంధీభవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేదు
ఎన్నికల్లో తప్పుడు ప్రచారంతో గెలిచిన కాంగ్రెస్
పార్టీ ఫిరాయింపుల కోసమే ప్రభుత్వమా?
కార్యకర్తల కష్టం వల్లే 8 పార్లమెంట్ స్థానాలు గెలిచాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేదని ఆరోపించారు. తెలంగాణలో తర్వాత ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. శంషాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తాము అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి విజయం సాధించిందని విమర్శించారు.
బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం, ఆ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అలవిగాని హామీలతో ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బండారం బయటపడటంతో ప్రజలు బీజేపీకి విజయం కట్టబెట్టారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల గెలుపు పూర్తిగా కార్యకర్తల విజయమని పేర్కొన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి గడ్డపై కాషాయ జెండా ఎగిరిందని, సీఎం సొంత జిల్లాలో కూడా బీజేపీ గెలిచిందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 14 శాతం నుంచి 35 శాతానికి పెరగడం మాములు విషయం కాదని చెప్పారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలువలేక ప్రజాగ్రహానికి గురైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి..8 నెలలు కావస్తున్నా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
రాజకీయ ఫిరాయింపులే కాంగ్రెస్ ఎజెండా
రాజకీయ ఫిరాయింపులే ఎజెండాగా కాంగ్రెస్ పాలన చేస్తున్నదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్‌లో చేర్చుకుని ఫిరాయింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీ పెద్దలకు సూట్ కేసులు పంపుతున్నారని ఆరోపించారు. ‘బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అంటున్నది. కానీ బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటి. ఆ పార్టీలు రెండు కలిసి గతంలో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయి. అధికారంలో భాగస్వాములయ్యాయి. గాంధీభవన్‌కు.. తెలంగాణ భవన్‌కు తేడా లేదు’ అని విమర్శించారు.
స్థానికంలో సత్తా చాటుదాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ స్థాయి నుంచి పోటీ చేయాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. యువతను, కుల సంఘాలను కలిసి వారి సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మండల, రాష్ర్ట స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, రాష్ర్ట కార్యవర్గ సమావేశం స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని కోరారు.
దక్షిణాదిలోనూ ఉన్నాం: ధర్మేంద్ర ప్రధాన్
రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరూపితమైందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దక్షిణ భారతంలో బీజేపీకి కొత్త శకం మొదలైందని అన్నారు. గతంలో బీజేపీ ఉత్తర భారతదేశానికే పరిమితమని కొంతమంది విమర్శించేవారని, లోక్‌సభ ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యమేంటో వారికి అర్థమైందని అన్నారు. తెలంగాణలో 35 శాతం ఓట్లు గెలుచుకుని సత్తా చాటామని తెలిపారు.
కేరళలో ఖాతా తెరవడమే కాకుండా తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నంబర్ వన్ పార్టీగా అవతరించేందుకు తమవద్ద 1500 రోజుల ప్రణాళిక ఉందని ప్రధాన్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్‌కు వంద సీట్లు దాటలేదని, 13 రాష్ట్రాల్లో అసలు ఖాతానే తెరవలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమానపరుస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో రాష్ర్టంలో బూత్ లెవెల్‌లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీకి ఉస్మానియాలో తిరిగే దమ్ముందా
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘తెలంగాణలో మీ పార్టీయే అధికారంలో ఉంది కదా? మీకు ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తించిన తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 లోక్ సభ స్థానాలు కట్టబెట్టారని అన్నారు. తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. తెలంగాణలో ఈసారి భాజపాదే అధికారమని అన్నారు. 3వసారి మోదీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆమోదించారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు
ప్రధాని మోదీపై, బీజేపీపై నమ్మకంతో ఓట్లేసి 8 అసెంబ్లీ, మరో 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, దుష్ర్పచారాలు చేసినా ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించులోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. స్థానిక సంస్థలను గెలుచుకుంటేనే క్షేత్ర స్థాయిలో పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గులాబీ రంగు మూడు వర్ణాలైంది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.
బీఆర్‌ఎస్ పాలనలో మూడు రంగుల జెండామీద గెలిచినవాళ్లు గులాబీ కండువా కప్పుకున్నారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులాబీ కండువాపై గెలిచినవాళ్లు మూడు రంగుల కండువా కప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు గ్రూప్- ప్రిలిమ్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపికచేయాలని భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు కాని రేవంత్‌రెడ్డి మాత్రం నెలానెలా రూ.4 లక్షల జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. గ్రూప్ మెయిన్స్ 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గ్రూప్ పోస్టులను 2000కు పెంచాలని, గ్రూప్ 3000 పోస్టులు చేయాలని, డీఎస్సీ పరీక్షలు 30 రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల విశ్వాసం కోల్పోయిన సర్కారు
అతి తక్కువ కాలంలోనే రేవంత్‌రెడ్డి సర్కారు నిరుద్యోగ యువత విశ్వాసం కోల్పోయిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం మాకు లేదంటూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేతులెత్తేస్తున్నదని, దీనిపై ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి బిల్లుకు 8 శాతం కమీషన్ ముందే చెల్లిస్తేనే బిల్లులు విడుదల చేస్తామని బాజాప్తా చెప్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవని అన్నారు.
ప్రతి బిల్లుకు లంచం తీసుకునే నీచ, నికృష్టమైన సంస్కృతి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని విమర్శించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి కూడా ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే విద్యార్థుల నుంచి ఎక్కువ డబ్బులు యాజమాన్యాలు తీసుకునే దుస్థితి వచ్చిందని తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఒక్కో చదరపు అడుగుకు రేవంత్‌రెడ్డి మనుషులు రూ.75 లంచంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పీర్జాదిగూడలో ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకుంటున్న ఇళ్లను రాజకీయ కక్షతో రాత్రికి రాత్రే కూల్చివేశారని మండిపడ్డారు. అధికారులు చట్టానికి, వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో 15 రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టారు. వీటిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టగా..ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు బలపర్చారు.
రాజకీయ తీర్మానంలోని అంశాలు
* రుణ మాఫీ వెంటనే అమలు చేయాలి
* రైతు భరోసా వెంటనే ఇవ్వాలి
* విద్యార్థి యువ వికాసం గ్యారెంటీలను అమలు చేసి ప్రోత్సాహకం అందించాలి
* క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తేవాలి
* గ్రామ పంచాయితీలకు గ్రహణం వీడాలి
* వెంటనే ధరణి ప్రక్షాళన చేపట్టాలి
* పునాది పడని ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలి
* కాళేలేశరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
* ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నిగ్గుదేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలి
* విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేయాలి
* ధాన్యం కొనుగోలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలి
* గొర్రెల పంపిణీ స్కాం, వాక్స్, ల్యాండ్, శాండ్, గ్రానైట్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
* అర్హులైన పేదలందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి
* ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలి
* వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి