జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ బి.ఎల్ రాజు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): వర్గీకరణ, క్రిమిలేయర్ ను అమలు చేయడం ద్వారా మాలలను అణిచివేయడానికి కాంగ్రెస్, బిజెపి సర్కారులు పూనుకున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి ఎల్ రాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జేఎన్ రావు, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ లు ఆరోపించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న మాలల ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని వారు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్గీకరణ, క్రిమిలేయర్ అమలు చేయడం ద్వారా తెలంగాణలోని 22 మాల, మాల ఉపకులాలకు అన్ని రంగాల్లో విద్యా, ఉపాధి, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, జీవన సామాజిక రంగాల్లో తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు వర్గీకరణతో మాలల భవిష్యత్తును దెబ్బతీయడానికి మనువాద పాలకులు చేస్తున్న చర్యలు కుట్రలు పైన పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే మాలలకు బానిసత్వం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు సిహెచ్. రోజాలీలా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవేందర్ రావు, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్. పద్మ, గ్రేటర్ అధ్యక్షురాలు భూపల్లి హేమలత తదితరులు పాల్గొన్నారు.