calender_icon.png 19 January, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అయోమయం

19-01-2025 12:00:00 AM

  • ఈజీఎస్ జాబ్ కార్డుల ద్వారా కూలీల గుర్తింపు 
  • కేవలం గ్రామ పంచాయతీలలోనే ఉపాధి హామీ అమలు 
  • జిల్లాలో మిగిలింది 33 పంచాయతీలే 
  • మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో భిన్నమైన పరిస్థితి 

మేడ్చల్, జనవరి 18(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై అయోమయం నెలకొంది. ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదైన వారు అర్హులుగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలలో అమలులో లేదు. మేడ్చల్ జిల్లాలో ఇటీవల కొన్ని జీపీలు మున్సిపాలిటీలలో కలువగా మిగిలిన జీపీలు కూడా కొనసాగడంపై సందిగ్ధం నెలకొంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు సందేహంగా మారింది. 

కూలీలను గుర్తించడానికి ప్రభుత్వం ఉపాధి హామీని ఎంచుకోవడం సరైనప్పటికీ, మేడ్చల్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఇటీవల 28 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేయగా కేవలం 33 మాత్రమే మిగిలాయి. ఇవి కూడా కొత్త మున్సిపాలిటీలలో విలీనం అవుతాయని ప్రచారం జరుగుతోంది. గతంలో ఐదు జడ్పిటిసి స్థానాలు, 61 గ్రామపంచాయతీలు ఉండేవి. ఇటీవల జీపీలను మున్సిపాలిటీలలో విలీనం చేయడంతో కేవలం 3 మండలాలు మాత్రమే మిగిలాయి.

వీటితో జిల్లా పరిషత్ కొనసాగే అవకాశం లేదు. దీంతో మిగిలిన జీపీలను కూడా మున్సిపాలిటీలలో విలీనం చేస్తారని అంటున్నారు. వీటిని కూడా విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం ఉండదు. ఇందిరమ్మ రైతు భరోసా కూడా అమలయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని ఈనెల 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సర్వే గ్రామపంచాయతీలలో జరుగుతోంది.

పల్లెటూరు... పట్టణ హోదా 

జిల్లాలో చాలా గ్రామాలలో పల్లెటూరి వాతావరణం ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీకి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ విలీనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని పాటించింది. మున్సిపాలిటీలలో గ్రామాలు విలీనం కావడం వల్ల పనులు పెరగడమే గాక, ఉపాధి హామీ పథకం నిలిచిపోయింది. తాజాగా ఇందిరమ్మ రైతు భరోసా కూడా అందడం లేదు. 33 గ్రామపంచాయతీలలో ప్రస్తుతం లబ్ధిదారులను ఎంపిక చేసిన భవిష్యత్తులో మున్సిపాలిటీలలో విలీనం చేస్తే ఈ పథకం నిలిచిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.