calender_icon.png 20 September, 2024 | 6:20 AM

గ్యాస్ సబ్సిడీపై అయోమయం!

27-07-2024 01:36:54 AM

  1. రూ.500 గ్యాస్ పథకంపై స్పష్టత కరువు 
  2. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవి 1,95,297 ఆన్‌లైన్‌లో నమోదైనవి 1,20,922 
  3. ప్రశ్నార్థకంగా 74,375 కనెక్షన్లు 
  4. మెదక్ జిల్లా వినియోగదారుల పరేషాన్

మెదక్, జూలై 26(విజయక్రాంతి): మహాలక్ష్మీపథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా మెదక్ జిల్లాలో ఈ పథకం అమలుపై స్పష్టత లేకుండా పోయింది. ఈ విషయంలో సంబంధిత అధికారులతో పాటు, వినియోగదారులు సైతం అయోమయంలో ఉన్నారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 17 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా కంపెనీల్లో సుమారుగా 2.30 లక్షల పైచిలుకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది డిసెంబరు 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వరకు ప్రజాపాలన కార్యక్రమంలో గ్యాస్ సబ్సిడీ కోసం వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగివుండి గ్యాస్ సబ్సిడీ కోసం 1,95,297 దరఖాస్తులు వచ్చాయని, అందులో 1,20,922 కనెక్షన్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 74,375 కనెక్షన్లు ఏ కారణం చేత ఆన్‌లైన్‌లో నమోదు కాలేదో వెల్లడించడంలేదు. ఆన్‌లైన్‌లో నమోదైన కనెక్షన్లకు సైతం సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలు, డీసీఎస్‌వో కార్యాలయం, కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో వినతులు ఇస్తూ వస్తున్నారు. 

ప్రాసెస్ కోసం పాట్లు

సబ్సిడీ గ్యాస్ డబ్బుల జమ కోసం లబ్ధిదారులు ఏజెన్సీ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిలబడి ఈకేవైసీ చేయించుకున్నా రు. అయినా కూడా సబ్సిడీ డబ్బులు జమ కావడంలేదు. అయితే సబ్సిడీ గురించి గైడ్‌లైన్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు.

ఆప్షన్ విషయంలో స్పష్టత లేదు

గ్యాస్ సబ్సిడీ విషయంలో ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి, బ్యాంక్, కన్జ్యూమర్ నంబర్‌కు ఫోన్ లింకు, ఆధార్ లింక్ లేకపోవడం వల్ల కూడా పలువురు లబ్ధిదారులకు మహాలక్ష్మీ పథకం వర్తించడం లేదు. ప్రభుత్వం నుంచి మాకు ప్రత్యేకంగా ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. 

 బ్రహ్మారావు, డీసీఎస్‌వో, మెదక్ జిల్లా