calender_icon.png 23 October, 2024 | 5:58 PM

మెడికల్ సీట్ల జీవోపై అయోమయం

07-08-2024 03:09:05 AM

  1. స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్న విద్యార్థులు
  2. న్యాయం చేయాలంటూ మంత్రి రాజనర్సింహకు వినతి
  3. ఇతరులకు మన సీట్లు వెళతాయన్న కేటీఆర్
  4. తెలంగాణ విద్యార్థులకే ప్రయోజనమన్న మంత్రి

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలు తెలంగాణ విద్యార్థులకు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ రూల్స్ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. స్థానికతపై రాష్ర్ట ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతున్నదనే చర్చ జరుగు తోంది.

ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటు న్నారు. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విద్యాసంస్థల అడ్మిషన్లలో 2014 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా ఉంది. ఈ చట్టంలో పేర్కొన్న గడువు ముగిసిన నేపథ్యంలో తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కాళో జీ హెల్త్ యూనివర్సిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది.

స్థానికత నిర్ధారణపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ర్టప్రభుత్వం జూలై 19న జారీ చేసిన 33 జీవో ప్రకా రం స్థానికత నిబంధనలను పేర్కొన్నట్టు తెలిపింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎక్క డ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

2024 వరకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడేళ్ల కాలం లో గరిష్ఠంగా 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ కొత్త రూల్స్‌తో ఏపీ వారికి ఇక్కడి మెడికల్ సీట్లు ఇచ్చేందుకు జరుగుతున్న కుట్రగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జీవో 33 సవరణ తెలంగాణ వారికి అన్యాయం జరుగు తుందని పలువురు విద్యార్థులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రం అందచేశారు.

ఈ జీవో వల్ల వారికి మెడికల్ సీట్లు అప్పనంగా అప్పగించినట్లు అవుతుందని వాపోతున్నారు. 6 నుంచి 9 వరకు ఎక్కడ చదివారు అనేది పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 10 వరకు తెలంగాణలో చదివి ఇంటర్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు సైతం స్థానికత కోల్పోయేలా చేస్తుందన్నారు. జీవో 33 సవరణలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మన సీట్లు పోతాయి: కేటీఆర్

స్థానికత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. మెడిసిన్ సీట్ల విషయంలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తా రా? అని ప్రశ్నించారు. జీవో 33 ప్రకారం ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే  ఉందన్నారు. ఈ రూల్స్‌తో చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని అన్నారు.

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలున్నందున ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువమంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని, కొత్త నిబంధనల మేరకు వారం తా లోకల్ అవుతారని, బయట చదివిన మన విద్యార్థులు నాన్‌లోకల్ అవుతారని అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునాలని డిమాండ్‌చేశారు. 

మన విద్యార్థులకు అన్యాయం జరుగదు: మంత్రి దామోదర

మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి 2017 జులై 5న అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు జారీ చేసిన జీవో 114ను ప్రస్తావిస్తూ అందులో 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనను జీవో 33లో కొనసాగించామని తెలిపారు.

అదే జీవోలోని 6 నుంచి 12వ తరగతి వరకు కనీసం 4 ఏళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమని మంత్రి పేర్కొన్నారు. జీవో 114 నిబంధనల ప్రకారం విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో, మిగిలిన మూడేళ్లు ఏపీలో చదివితే వారిని తెలంగాణ స్థానికులుగానే పరిగణించారని మంత్రి గుర్తుచేశారు.

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం మేరకు జూన్ 2తో పదేళ్లు పూర్తయినందున ఈ నిబంధనను కొనసాగించలేమని ఆయన పేర్కొన్నారు. జీవో 33తో ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరైంది కాదని అన్నారు.