calender_icon.png 2 April, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవ వేదికపై అయోమయం

27-03-2025 12:53:47 AM

ఘట్‌కేసర్ కు మారుస్తున్నారని ప్రచారం 

తమకు సమాచారం లేదంటున్న పార్టీ శ్రేణులు 

మేడ్చల్, మార్చి 26 (విజయ క్రాంతి): భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేదికపై ఆ పార్టీలో అయోమయం నెలకొంది. ముందుగా నిర్ణయించిన విధంగా వరంగల్ లో నిర్వహిస్తారా? మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ కు మారుస్తారా? అనే విషయంలో డైలమా ఏర్పడింది. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా రజతోత్సవం ఘనంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినందున ఆ జిల్లా నాయకులతో కెసిఆర్ సమావేశం నిర్వహించారు. సభకు అనువైన స్థలాలు పరిశీలించాలని సూచించారు. దీంతో నాయకులు దేవన్నపేట్, బట్టుపల్లి ప్రాంతాలను పరిశీలించి, రైతులతో మాట్లాడుతున్నారు. ఇంతలోనే రజతోత్సవ వేదిక మారుస్తున్నారని ప్రచారం గుప్పుమంది. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ లో నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఘట్కేసర్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. సభ నిర్వహణకు వందల ఎకరాలు అవసరం అవుతుంది. హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న ఘట్కేసర్ ప్రాంతంలో సభ నిర్వహణకు కావలసిన స్థలం దొరకడం చాలా కష్టం. 

మల్లారెడ్డి పైనే భారం 

రజతోత్సవం ఒకవేళ ఘట్కేసర్ లో నిర్వహిస్తే నిర్వహణ భారం మాజీ మంత్రి మల్లారెడ్డి పైనే పడుతుంది. జిల్లాలో మిగతా నలుగురు ఎమ్మెల్యేలు బీ ఆర్‌ఎస్ కు చెందిన వారే అయినప్పటికీ వారు భారం మోసే పరిస్థితి లేదు. జిల్లా అధ్యక్షుడు ది కూడా ఇదే పరిస్థితి. అంగ బలం, ఆర్థిక బలం ఉండడమే గాక అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసినందున ఇప్పుడు కూడా భారం మోయాల్సిన పరిస్థితి ఉంటుంది. 

మాకు సమాచారం లేదు ; భాస్కర్ యాదవ్, బి ఆర్ ఎస్ నేత 

ఘట్కేసర్ లో రజతోత్సవం నిర్వహించే విషయమై తమకు సమాచారం లేదని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, పార్టీ ముఖ్య నాయకుడు భాస్కర్ యాదవ్ తెలిపారు. ఘట్కేసర్ కు వేదిక మారుస్తున్నారని పుకారు మాత్రమే నన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే మల్లారెడ్డిని అడిగామని, తనకు తెలియకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోదని మల్లారెడ్డి చెప్పారని ఆయన వివరించారు.