calender_icon.png 16 October, 2024 | 3:59 PM

గందరగోళంగా టీచర్ల కౌన్సెలింగ్!

16-10-2024 02:35:25 AM

ఉదయం వాయిదా.. మధ్యాహ్నం యథావిధి

వాయిదా ప్రకటనతో ఆందోళన పడ్డ అభ్యర్థులు

మిగిలిన వారికి నేడు పోస్టింగ్స్

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నియామక పత్రాలు అందుకున్న డీఎస్సీ-2024 నూతన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం కాసేపు గందరగోళంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయమే కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఉపాధ్యాయులు బుధవారం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

అయితే వివిధ జిల్లాల్లో సెలక్షన్ లిస్ట్ రాకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ముందస్తుగా ప్రకటించింది. దీంతో జిల్లాల్లోని కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు చెప్ప డంతో కొంత మంది అభ్యర్థులు కేంద్రాల నుంచి వెనుదిరిగారు.

ఆ తర్వాత మధ్యాహ్నం సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జిల్లా విద్యాధికారులకు విద్యాశాఖ అనుమతినిచ్చింది. దీంతో మధ్యాహ్నం కౌన్సెలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగింది. అయితే అప్పటికే కౌన్సెలింగ్ కేంద్రాల వెనుదిరిగిన అభ్యర్థులకు అధికారులు సమాచారమిచ్చి మళ్లీ పిలిపించారు. 

317 సమస్య కారణంగానే వాయిదా?

టీచర్ల కౌన్సెలింగ్ వాయిదాకు ప్రధానంగా సాంకేతిక సమస్యనే అధికారులు కారణంగా చెబుతున్నా.. అసలు సమస్య మాత్రం వేరే ఉందని విద్యావర్గాల ద్వారా తెలిసింది. 317 జీవో అమలైనప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. తమ సమస్యను పరిష్కరించకుండా డీఎస్సీ ఉపాధ్యాయులకు పోస్టింగ్స్ ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని, మళ్లీ తాము దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని 317 జీవో బాధిత ఉపాధ్యాయుల వాదన. తమకు న్యాయం జరిగే వరకు కౌన్సెలింగ్

ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతున్నారు. వీరి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వాన్ని అధికారులు స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత వచ్చేంత వరకు కౌన్సెలింగ్‌ను ఆపాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. కౌన్సెలింగ్‌ను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో యథావిధిగా కొనసాగించారు.

మిగిలిన వారికి ఈ రోజు..

10,006 మంది కొత్త టీచర్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించిన విద్యాశాఖ ఆయా టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి నేడు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పోస్టింగ్‌లు అందుకున్న టీచర్లు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 16న (నేడు) చేరాల్సి ఉంటుంది. వీరు చేరిన స్థానంంలో మూడు నెలల (జులైలో) క్రితం బదిలీ అయి రిలీవ్ కాని సుమారు 7 వేల మంది టీచర్లు తమకు కేటాయించిన స్కూళ్లకు వెళ్తారు. ఈ రిలీవ్‌కు సంబంధించిన ఆదేశాలను కూడా అధికారులు మంగళవారమే జారీ చేశారు.