calender_icon.png 28 February, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తికమక జవాబులు

28-02-2025 01:53:16 AM

  1. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా! 
  2. నేను జ్ఞాపకశక్తిని కోల్పోయా.. 
  3. పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నలకు విశ్రాంత ఈఎన్సీ సమాధానం
  4. చైర్మన్ జస్టిస్ ఘోష్ సీరియస్.. 
  5. నిజాలు దాచొద్దని హితవు 

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై గురువారం పీపీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ వాడీవేడిగా జరిగింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు విశ్రాంత ఈఎన్సీలు నల్ల వెంకటేశ్వర్లు, మురళీధర్‌రావు, హరిరామ్, సీడీవో మాజీ సీఈ నరేందర్‌రెడ్డి తికమక పడ్డారు. కొన్ని ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ వారిపై సీరియస్ అయింది.

‘ప్రాజెక్ట్ పరిధి లోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నా రం బరాజ్‌ల కాస్ట్ ఎంత ?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ‘రూ.9 వేల కోట్లు’ అని ఈఎన్సీలు సమాధానమిచ్చారు. అందుకు కమిషన్ స్పందిస్తూ.. ‘రూ.13 వేల కోట్లు అని కమిషన్ రికార్డులు చెప్తున్నాయి. మీరు చెప్తున్నట్లు రూ.9 వేల కోట్లే వెచ్చిస్తే మిగతా డబ్బంతా వృథా అయిందా?’ అంటూ మరో ప్రశ్న వేసింది. అందుకు ఈఎన్సీలు, సీడీవో మాజీ సీఈ మౌనం వహించడం గమనార్హం. 

సమాధానాలపై అసహనం..

కమిషన్ అనంతరం విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావును అనేక అంశాలపై ప్రశ్నించగా.. ఆయన ప్రతి ప్రశ్నకు ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అంటూ సమాధానమి చ్చారు. కొన్ని ప్రశ్న లకు పూర్తి మౌనం వహించడం తో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘మీరెప్పుడు ఉద్యోగ విరమణ చేశా రు?’ అంటూ ప్రశ్నించారు. ‘గతేడాది..’ అంటూ మురళీధర్‌రావు జవాబివ్వగా.. ‘నేను న్యాయమూర్తిగా ఇచ్చిన తీర్పులన్నీ నాకు గుర్తున్నాయి.

మీకెందుకు గుర్తులేదు’ అంటూ ఘోష్ తిరిగి ప్రశ్నించారు. అందుకు ‘నేను జ్ఞాపకశక్తిని కోల్పోయాను’ అంటూ మురళీధర్‌రావు సమాధానమివ్వడంతో ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుస్తకాలు బాగా చదవండి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది’ అంటూ సూచించారు. ‘డా క్యుమెంట్లు దాచిపెట్టొద్దు.. నిజాలు దాచొద్దు’ అంటూ హితవు పలికారు.

బరాజ్ నిర్మాణ స్థలాలు ఎందుకు మార్చారు?

కమిషన్ అనంతరం విశ్రాంత ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లును విచారిస్తూ.. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ ఎందుకు మా ర్చారు ?’ అని ప్రశ్నించింది. వెంకటేశ్వర్లు సమాధానమిస్తూ.. ‘గ్రావిటీ కెనాల్ పొడవు, అటవీ భూముల సేకరణ, విద్యుత్ చార్జీల తగ్గించేందుకే బరాజ్‌ల నిర్మాణ స్థలాలను మార్చాం’ అని చెప్పారు. కమిషన్ వెనువెంటనే ఎవరి సూచనల మేరకు లొకేషన్ మార్చారు’ అంటూ ప్రశ్న సంధించింది.

‘సీఈ సూచనల మేరకే బరాజ్‌ల నిర్మాణ స్థలాలు మార్చాం’ అని వెంకటేశ్వర్లు జవాబిచ్చారు. ‘ఎవరి ఆదేశాల మేరకు బ్యారేజీలో నీరు నిల్వ చేశారు’ అం టూ కమిషన్ ప్రశ్నించగా.. ‘అప్పటి సీఎం కేసీఆర్ సూచనల మేరకే నీటి ని నిల్వ చేశాం’ అని టక్కున వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. ‘పనుల ఆలస్యంపై ఏజెన్సీలకు ఎప్పుడైనా జరిమానా విధించారా ?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ‘అలాంటి పని మేమెప్పుడూ చేయలేదు’ అని వెంకటేశ్వర్లు జవాబిచ్చారు.

‘బరాజ్‌ల నిర్మాణ సమయంలో సరైన పర్యవేక్షణ లేదంటే ఒప్పుకొంటారా?’ అనే కమిషన్ ప్రశ్నకు.. ‘బరాజ్‌ల నిర్మాణ పనులను నేను తరచూ పర్యవేక్షించాను’ అని సమాధానమిచ్చారు. కమిషన్ అనంతరం ముగ్గురు కాగ్ సభ్యులనూ కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. వారి నుంచి కూడా కమిషన్ అవే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది.