calender_icon.png 20 January, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కులు తెచ్చిన వ్యాఖ్యలు

05-10-2024 12:00:00 AM

ప్రజా జీవితంలో ఉండే వారు ఆచితూచి మాట్లాడాలనే సంప్రదాయాన్ని ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు విస్మరించినట్లు కనిపిస్తోంది. సొంతంగా ఆలోచించకుండా సోషల్ మీడియాలో వచ్చేవాటి ప్రభావానికి లోను కావడం అనేక సందర్భాల్లో చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం సైతం ఈ కోవలోకే వస్తుంది.

మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ మెడలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దండవేయడంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం అవమానకర రీతిలో ట్రోలింగ్ చేయడంతో ఆమె తీవ్రంగా ఆవేదన చెందారు.తన ఆవేదనను ఆమె మీడియా ముఖంగానే వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

అప్పుడు ఒక మహిళగా ఆమెపై అన్నివర్గాలనుంచి సానుభూతి వ్యక్తమయింది. చివరికి బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సైతం దీనిపై విచారం వ్యక్తం చేశారు. అయితే అదే క్రమంలో కేటీఆర్‌పై ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తూ సినీ పరిశ్రమలో పలువురు నటీనటులు ఆయన కారణంగా విడాకులు తీసుకున్నారని, అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు కూడా కేటీఆరే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో అనాలోచితంగా చేసిన ఆ వ్యాఖ్యలపై సినీ రంగమంతా భగ్గుమంది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ లబ్ధి కోసం ఏ సంబంధం లేని సినీ ప్రముఖుల జోలికి వస్తే క్షమించేది లేదంటూ నటులు మొదలుకొని అందరూ మండిపడ్డారు. అటు నాగచైతన్య, సమంతలు కూడా తమ విడాకుల విషయంలో ఎవరి జోక్యం లేదని, తామిద్దరమూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.

ఒక మహిళా మంత్రి మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మొత్తం సినీరంగం ఒక్క తాటిపై నిలిచింది. నాగచైతన్య తండ్రి నాగార్జున అయితే తన కుమారుడు, సమంతల విడాకులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి తమ కుటుంబం పరువుకు భంగం కలిగించినందుకు సురేఖపై పరువు నష్ట దావాకు సిద్ధమయ్యారు.

తన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీయడంతో తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ అవమానించడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరువునష్టం దావా విషయంలో నాగార్జున వెనక్కి తగ్గకపోగా, కేటీఆర్ సైతం సురేఖకు పరువునష్టం దావా నోటీసులు పంపించారు.

దీంతో రెండురోజుల క్రితం వరకు బాధితురాలిగా అందరి సానుభూతి పొందిన మంత్రి ఒక్కసారిగా నిందితురాలిగా మారిపోయారు. వివాదం మరింత ముదిరేలా కనిపించడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సైతం మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందున ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ రంగానికి విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

అయినప్పటికీ ఈ వ్యవహారం ముగిసేలా కనిపించడం లేదు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ను మాత్రం వదిలేది లేదని మంత్రి అంటుండడం, ఆయన సైతం  న్యాయపోరాటానికి సిద్ధమవుతుండడం అధికార కాంగ్రెస్ పార్టీకి సైతం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే హామీల అమలు, హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణలాంటి అంశాలపై ప్రతిపక్షాలనుంచి రాజకీయదాడిని ఎదుర్కొంటున్న ఆ పార్టీకి ఇప్పుడు తాజా వివాదం తోడయింది.

దీనినుంచి ఎలా బయటపడాలని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారు. ఓ మహిళా మంత్రిపై ట్రోలింగ్ ఎంతమాత్రం క్షమార్హం కానప్పటికీ దాన్ని తిప్పికొట్టే క్రమంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు  మొత్తం వ్యవహారానికి రాజకీయ రంగు పులిమాయి.

మరోవైపు లైక్‌లు, వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్న సోషల్ మీడియా తీరుపైనా ప్రజలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ధోరణిని కట్టడి చేయని పక్షంలో భవిష్యత్తులో ఎవరికీ వ్యక్తిగత గోప్యత అనేది ఉండదన్న భావన బలంగా వినిపిస్తోంది.