యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైశేత్వర్
ముషీరాబాద్,(విజయక్రాంతి): రక్త శాస్త్రంలో పురోగతిపై సమావేశాన్ని ఈనెల 22,23 తేదీల్లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్(Yashoda Hospital) ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్, హెమటో-ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ గణేష్ జైశేత్వర్ తెలిపారు. రక్త రుగ్మతలతో పోరాడుతున్న ప్రతి రోగికి ప్రపంచ స్థాయి సంరక్షణను అందిస్తూ ఈ ఆవిష్కరణలలో తాము ముందంజలో ఉన్నామన్నారు.
బ్లడ్ డిజార్డర్స్, బ్లడ్ క్యాన్సర్ నివారణకు నూతన ఆవిష్కరణ తీసుకువచ్చేందుకు 'డెక్కన్ హెమటో లింక్ 2.0 -2025' పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 200 పైగా జాతీయ, 10 పైగా అంతర్జాతీయ నిపుణులతో నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ రక్త్ టికిల్, ఎసెన్షియల్ హెమటాలజీ, అడ్వాన్స్‌డ్ హెమటో-ఆంకాలజీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అత్యాధునిక చర్చలను తీసుకు వస్తుందన్నారు.
ఈ కార్యక్రమం లుకేమియా, లింఫోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా, హిమోఫిలియా వంటి ప్రాణాంతక పరిస్థితులను నయం చేయడంలో కీలకం అన్నారు. శాస్త్రీయ పురోగతితో ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులను అత్యంత సునాయాసంగా నయం చేయగలదన్నారు. ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ప్రెసిషన్ మెడిసిన్, అధునాతన స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌లతో 2025లో హెమటాలజీ భవిష్యత్తు గతంలో కంటే ప్రకాశవంతంగా కనిపిస్తోందన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు డయాగ్నస్టిక్స్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాయన్నారు.