ముషీరాబాద్ (విజయక్రాంతి): తల్లి తలచుకుంటే బిడ్డలను లక్ష్య సాధనలో ఎంత వరకైనా తీసుకెళ్తుందన్న నినాదానికి ఇది మంచి ఉదాహరణ. ఇంగ్లీష్ ఛానెల్ ను ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు నెలకొల్పిన నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వినీ విక్టోరియా(Swimmer Gandham Queenie Victoria) మరో రికార్డు నెలకొల్పడానికి సిద్ధమైంది. ఆరేబియా మహా సముద్రం ముంబాయి సమీపంలోని మండ్యాజెట్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా(Gateway of India) వరకు తన కుమారుడితో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ నిర్వహిస్తున్నట్లు గురువారం బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Swimming Federation of India) మహరాష్ట్ర ఓలంపిక్ అసోసియేషన్(Maharashtra Olympic Association) అనుమతితో ఈనెల 19న డిగ్రీ చదువుతున్న తన కుమారుడు సీపెన కుమార్(20)తో కలిసి ఈ స్విమ్మింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండ్వాజెట్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు 18 కిలోమీటర్లు ఉంటుందని, ఆరేబియా మహాసముద్రంలో ఈ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్(Open water swimming) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి, కుమారుడితో కలిసి ఈ ఓవెన్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి అని ఇంత వరకు ఎవరు ఇలాంటి సాహసం చేయలేదని తెలిపారు. ఈనెల 19న ఉదయం 6.30 గంటలకు మండ్యాజెట్ వద్ద ఈ స్విమ్మింగ్ ను ప్రారంభించి అదే రోజు సాయంత్రం వరకు గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటామని తెలిపారు. ఈనెల 18న ముంబాయి బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పిన్ స్విమ్మింగ్లో ఇప్పటికే తాను గోల్డ్, సిల్వర్, కాంస్య పతకం సాధించానని తెలిపారు.