* కాలేజీ యాజమాన్యాలతో గొడవలెందుకు ?
* సమస్యలను సామరస్యంగా పరిష్కరించండి
* ఇంటర్మీడియట్ బోర్డుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ‘ఇంటర్ ప్రాక్టికల్స్ సమయంలో కాలేజీ యాజమాన్యాలతో గొడవలెందుకు ? సమస్యలను సామరస్యంగా పరిష్కరించి.. పరీక్షలను సజావుగా నిర్వహించండి’ అంటూ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం.
సోమవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ మొదలు కానున్న నేపథ్యంలో శనివారం ఇంటర్ బోర్డు, యాజమాన్యాలపై మధ్య నెలకొన్న స్పర్థలను పరిష్కరించేందుకు సీఎం ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిబంధనల పేరుతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టొద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, ఫీజు చెల్లింపు విషయంలో పట్టింపు వద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్యకు సీఎం సూచించినట్లు తెలిసింది. ప్రాక్టికల్స్‌కు సెంటర్లు ఇవ్వబోమని ప్రకటించిన కాలేజీ యజమాన్యాలకు జరిమానా విధించడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారని బోగట్టా.
సెంటర్ల కేటాయింపునకు యాజమాన్యాలు ఓకే
* ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సెంటర్ల కేటాయింపునకు కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య స్పష్టం చేశారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి 22 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయని, పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,33,805 మంది సెకండియర్ విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు.
పరీక్షల నిర్వహణకు సెంటర్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకూ అంగీకరించారని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగుతాయని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 3,246 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు అఫిలియేషన్లు పొందాయని వివరించారు.
వార్షిక పరీక్షలకు ఫస్టియర్ విద్యార్థులు 4,88,336 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,956 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. 207 మిక్స్‌డ్ ఆక్యుపెన్సీలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయని, వీటిలో 180 కాలేజీలకు అనుమతులు ఇస్తున్నట్లు తేల్చిచెప్పారు. మిగతా కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున, వాటికి అనుమతివ్వలేదని కుండబద్దలు కొట్టారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అఫిలియేషన్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని, ప్రస్తుత మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. సాంకేతిక తప్పిదం కారణంగానే మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీల్లోని సెకండియర్ విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు అవకాశమివ్వాల్సి వచ్చిందన్నారు.
హాల్‌టికెట్లను విద్యార్థుల మొబైల్ ఫోన్లకే లింక్ ద్వారా పంపిస్తామని స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంలో అడ్మిషన్ల ప్రక్రియకు ముందే గుర్తింపు కాలేజీల జాబితాను ప్రకటిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే కాలేజీ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.