12-02-2025 01:55:07 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో చేపడుతున్న కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించిన భూసేకరణపై సర్వే చేపట్టి, భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు పరిహారం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల ప్రాంతంలో ఎత్తిపోతల కాలువల కారణంగా తాము విలువైన భూమలు కోల్పోయామని నిర్వాసిత రైతులు 2017లో హైకోర్టును ఆశ్రయించారు.
ఆమోదించిన ప్రణాళిక ప్రకారం కాలువ పనులు చేపట్టాలన్న న్యాయస్థాన ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. పిటిషన్లపై మంగళవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. రైతుల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. కాలువ నిర్మాణంలో భాగంగా రైతులు 17.35 ఎకరాల భూమి కోల్పోయారని కోర్టుకు తెలిపారు.
ఎలాంటి అధ్యయనం లేకుండానే, ఆమోదించిన ప్రణాళికను మార్చడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ త్వరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. రైతుల సమ్మతితోనే భూములు సేకరించామని, పరిహారం కూడా చెల్లించామని వివరించారు.
ఇరుపక్షాల వాదనల న్యాయ మూర్తి స్పందిస్తూ.. కాలువ నిర్మాణ ప్రాంతంలో సర్వే నిర్వహించాలని, ఒకవేళ పిటిషనర్లకు చెందిన భూములు వాటిలో ఉంటే చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.