24-04-2025 08:07:59 PM
సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ, ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం...
భద్రాచలం (విజయక్రాంతి): కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించాలని కోరుతూ సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు మాట్లాడుతూ... కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్యని దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ ఉగ్రవాద దాడిలో కాశ్మీర్ లోని పర్యాటకులు 27 మంది మృతి చెందారని మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. మతం పేరుతో ఉగ్రవాద దాడులకు పాల్పడే వారిని క్షమించరాదని కఠినంగా శిక్షించాలని అన్నారు. జరిగిన సంఘటనకు కొంతమంది మతోన్మాదులు మతం రంగు పులిమి ప్రజల మధ్య ఐక్యతను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఉగ్రవాదులను అడ్డుకొని తమ ప్రాణాలను అర్పించిన యువకుడు ముస్లిం అని చనిపోయిన వారిలో హిందువులతో పాటు క్రైస్తవులు ముస్లింలు కూడా ఉన్నారని వారందరూ భారతీయులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని అన్నారు.
ఏ మత ఉన్మాదమైన దేశానికి ప్రపంచానికి ప్రమాదమని వారు పేర్కొన్నారు.. సంఘటన జరిగిన ప్రాంతంలో మిలటరీ బలగాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర నిఘా సంస్థలు ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం సరైనది కాదు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, కోరాడ శ్రీనివాస్ కనక శ్రీ,స్. డి ఫిరోజ్, డి రాఘవయ్య, సిహెచ్ మాధవరావు, సీనియర్ నాయకులు ఎంవిఎస్ నారాయణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.