తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో ఏప్రిల్ 14న దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. అన్ని పక్షాల న్యాయవాదుల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. రాత పూర్వక వాదనలను శుక్రవారంలోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై బుధవారం జస్టిస్ బీ విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాదులు పీ శ్రీరఘురాం, బీ మయూర్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ అనర్హత వేటు వేయాలంటూ పిటిషనర్లు ఫిర్యాదులను స్పీకర్‌కు సమర్పించి 10 రోజులైనా సమయం ఇవ్వకుండానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.
ఫిర్యాదులను పరిశీలించే గడువు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కోర్టులు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయజాలవని అన్నారు. అనర్హత కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు వేర్వేరు తీర్పులు వెలువరించిందని, వాటిలో అనుకూలమైన కొన్నింటిని ఎంపిక చేసుకుని వాటి ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలని కోరడం సరికాదని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసులో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి ఇదే హైకోర్టులో ధర్మాసనం నిరాకరించిందని గుర్తుచేశారు. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ కోర్టు ఉత్తర్వులు జారీచేయడం సరికాదన్నారు. అభ్యంతరాలుంటే విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.