అసాధారణ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించండి
ఇందూ ఫార్చ్యూన్ విల్లా అసోసియేషన్‌కు హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కూకట్‌పల్లి ఇందూ ఫార్చ్యూన్ విల్లా కమ్యూనిటీలోని క్లబ్‌హౌస్‌లో గ్యాంబ్లింగ్, మద్యం, డ్రగ్స్, అక్రమ కార్యకలాపాలు చోటుచేసుకోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై 4 వారాల్లో అసాధారణ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాలని ఓనర్ల అసోసియేషన్‌కు సోమవారం ఆదేశాలు జారీచేసింది. క్లబ్ హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫోన్ ద్వారా, వాట్సాప్‌లోనూ పోలీసులకు ఫిర్యాదు చేసి నా పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అదే కమ్యూనిటీ వాసి సీహెచ్ హరిగోవింద ఖొరానారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు. అసోసియేషన్ తరఫు సీనియర్ న్యాయవాది రేసు మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జూలై 10న అసోసియేషన్ సమావేశం నిర్వహించామని, కఠిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది కే మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇంత పెద్దఎత్తున కార్యకలాపాలు జరుగుతుంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంతో సరిపెట్టడం సరికాదని అన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి 4 వారాల్లో అసాధారణ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి, అందరి అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. విచారణను సెప్టెంబరు 9వ తేదీకి వాయిదా వేశారు.