26-02-2025 11:03:26 PM
సాంకేతిక లోపంతో నిలిచిన స్పైస్ జెట్ విమానం..
విమాన సిబ్బందితో తీవ్ర వాగ్వాదం..
స్పైస్ జెట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన భక్తులు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. సాంకేతిక లోపంతో చివరి నిమిషంలో స్సైస్ జెట్ ఎయిర్‌వేస్ విమానాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేలా పుణ్యస్నానాలు బుధవారం శివరాత్రి సందర్భంగా చివరి రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు సుమారు 48 వేల చొప్పున టికెట్ బుక్ చేసుకున్నారు. అనంతరం ప్రయాణికులు తమ బోర్డింగ్ కూడా పూర్తి చేశారు.
చివరి నిమిషంలో విమానం సాంకేతిక లోపంతో నిలిపివేస్తున్నట్లు సిబ్బంది తెలియజేశారు. తమకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని విమానయాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కనీసం తమకు అల్పాహారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. చాలామంది తమ పెద్దల చితాభస్మం గంగలో కలిపేందుకు, అదేవిధంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేసినా విమాన సంస్థ పట్టించుకోలేదు.