ఎల్బీనగర్, జూలై 31: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిరుద్యోగులు తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడానికి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం రాత్రి దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద వందలాది మంది నిరుద్యోగులు మెరు పు ధర్నా చేపట్టారు. కానిస్టేబుల్ ఉద్యోగాలను గతంలో ఇచ్చిన జీవో 46ను సవరించి, సీడీ సీడీ ప్రకారం పరీక్ష ఫలితాలను ప్రకటించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన ఉద్యోగార్థులకు జీవో 46 అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని కోరారు. కాగా, రాత్రివేళ వందలాది మంది ధర్నా చేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.