హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి) : తమ సమస్యలు పరిష్కరించాలని ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన అలైడ్ హెల్త్ సైన్స్ (అనెస్థీషియా) విద్యార్థులు చేస్తున్న ఆందోళన శుక్రవారం రెండో రోజుకు చేరింది. 2022 విద్యాసంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సుకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం గురించి చెప్పకుండా.. ఎంబీబీఎస్ విద్యార్థులకు చెప్పే పాఠాలు తమకు చెబుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కోర్సుపై అవగాహన లేక రాష్ట్ర వ్యాప్తంగా 866 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం 25 మంది మాత్రమే పాసయ్యారని వాపోయారు.
ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సమాధానం చెప్పాలన్నారు. గ్రేస్ మార్కులను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని కోరారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే హెల్త్ యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.