calender_icon.png 19 November, 2024 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి కోసం ఆందోళన

19-11-2024 12:14:54 AM

రామగుండం, నవంబర్ 18(విజయక్రాంతి) : తన భర్త ఆస్తితోపాటు పిల్లలను అప్పగించాలంటూ అత్తింటి ఎదుట కోడలు న్యాయ పోరాటానికి దిగిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం చోటు చేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని రమేశ్‌నగర్‌కు చెందిన సూర్యదేవర హరినాథ్‌కు ప్రశాంత్‌నగర్‌కు చెందిన కర్నాటి సుజాతతో 20 ఏళ్ల కిందట వివాహం కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హరినాథ్ అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అయితే అప్పటి నుంచి తన భర్తకు చెందిన ఆస్తిని ఇవ్వడం లేదని సుజాత వాపోయింది. ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తే భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని తీర్పు చెప్పినా.. వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది. కాగా, సోమవారం సుజాత తన తల్లిదండ్రులతో కలిసి రమేశ్‌నగర్‌లోని అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది.

తన భర్త ఆస్తి, ఇద్దరు పిల్లలనూ అప్పగించాలని వేడుకుంది. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భర్త మరణానంతరం తనకు అనాథను చేశారని, ఆస్తిలో తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం న్యాయపోరాటం చేస్తానని సుజాత పేర్కొంది. బాధితురాలికి పలు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.