calender_icon.png 16 January, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయం ఎదుట ఆందోళన

02-07-2024 05:22:45 AM

  • పాస్‌బుక్కుల కోసం నారాయణపురం రైతుల ధర్నా
  • మంత్రి పొంగులేటికి వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 1 (విజయక్రాంతి): తమ గ్రామంలోని 12౦౦ ఎకరాల్లో 800 ఎకరాల భూములకు పాసు బుక్కులు జారీ చేయాలని కోరుతూ సచివాలయం ఎదుట మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతులు ఆందోళన చేపట్టారు. ధరణిలో తమ గ్రామానికి చెందిన పట్టా భూములు అటవీ భూములుగా నమోదుచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అది అటవీ భూమి కాదని అటవీశాఖ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకువచ్చినా, కలెక్టర్లు పంచనామా చేసి ఇవి పట్టా భూములని నివేదిక అందించినా సీసీఎల్‌ఏ కమిషనర్ ధరణిలో పట్టా భూములుగా మార్చడం లేదని ఆరోపించా రు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత ఆరేళ్లుగా రైతుబంధు, రైతు బీమాతోపాటు పంట రుణాలు కూడా తీసుకోలేని దుస్థితి నెలకొందని చెప్పారు. గత ప్రభుత్వం 700 ఎకరాలను పట్టా భూములుగా పేర్కొంటూ పాసు పుస్తకాలు జారీ చేసినా.. వాటిపై ట్రూ కాపీ అని ముద్రించడంతో బ్యాంకు అధికారులు తమకు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 250 మంది రైతులకు జారీచేసిన పుస్తకాల్లో రైతుపేరును అడవి, రైతు తండ్రి పేరు కూడా అడవి అని ముద్రించారని వాపోయారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రైతుల వినతిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. వారం రోజుల్లోపు రైతుల సమస్య పరిష్కరించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.