త్యాగధనులు కోరుకున్న రాజ్యం నిర్మిద్దాం
టీఆర్‌పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క
ఘనంగా కామ్రేడ్ పటేల్ సుధాకర్ రెడ్డి వర్ధంతి
హనుమకొండ అర్బన్, మే 24 (విజయక్రాంతి): పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన త్యాగధనులు కోరుకున్న రాజ్యం నిర్మించడం కోసం, పీడిత అణగారిన ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పటేల్ సుధాకర్ రెడ్డి సహచరి పటేల్ వనజక్క పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కేంద్రం వడ్డేపల్లిలో టి ఆర్ పి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పటేల్ సుధాకర్ రెడ్డి 17 వ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
పీడిత ప్రజల విముక్తి పోరు బాట పట్టిన వేల మంది ఉద్యమకారులను పాలకులు కాల్చి చంపినారని, ఉన్నత విద్యావంతులైన ఎంతో మంది జీవితాలను త్యాగం చేసి ఉద్యమ బాట పట్టి ప్రజలకు ఎన్నో హక్కులు సాధించిపెట్టారని అలాంటి త్యాగాదనులు కలలుకన్న రాజ్య నిర్మాణం ద్వారానే భారతదేశంలో సమసమాజం ఏర్పడుతుందన్నారు.
సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పటేల్ సుధాకర్ రెడ్డి కుటుంబం నుండే తిరుగుబాటు మొదలు పెట్టీ ఉద్యమ ప్రస్థానంలో నేలకొరిగాడని, ఆ మహా నాయకుడు కాంక్షించిన రాజ్య నిర్మాణం కోసమే తను టి ఆర్ పి పార్టీలో చేరానన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ 80 ఏండ్లుగా దేశాన్ని పాలించిన ఆయా పార్టీలు ప్రజలను అన్ని రకాలుగా దోచుకున్నారని, రాష్ట్రంతో పాటు దేశంలో అణగారిన వర్గాల రాజ్యం నిర్మితం కోసం తీన్మార్ మల్లన్న నాయకత్వంలో నడుస్తున్న టి ఆర్ పి పార్టీకి అండగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీ.సీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలకు వ్యతిరేకంగా, నేడు తెలంగాణలో బహుజన సమాజానికి రాజకీయ అధికారాన్ని అందించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న నాయకత్వంలో టి ఆర్ పి ముందుకు సాగుతోందని, అమరవీరుల త్యాగాలకు నిజమైన గౌరవం అంటే బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించడమేనని అన్నారు.
ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, ఉపాధి, గౌరవం అందే సమాజం కోసం టి ఆర్ పి పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర నాయకులు గిరగాని బిక్షపతి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు మల్లికార్జున శాస్త్రి, న్యాయవాదులు జన్ను పద్మ, కర్రు పావని, శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, రాధక్క, శ్యామ్, సరిత, స్వర్ణక్క, అనసూర్య, సద్గుణ, గోవింద్, మాజీ మావోయిస్టు నాయకులు, బీ.సీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి, మహిళా నాయకులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు.






