29-03-2025 12:09:50 AM
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 21 స్కూళ్ళ గుర్తింపు
కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కసరత్తు
మెదక్, మార్చి 28(విజయక్రాంతి)ః మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల మానసిక, చదువు సామర్థ్యాలను పెంచాలి. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తయారు చేయాలంటే అందుకు అను గుణంగా బోధన చేపట్టాలి. ఇందుకోసం మౌలిక వసతులు కల్పించాలి.
అప్పుడే లక్ష్యాలను సాధించవ్చనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బోధన మొదలు పెట్టగా.. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను నేర్పించేందుకు సిద్ధం చేస్తున్నా రు. ఇందుకోసం కనీసం 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కసరత్తు చేశారు.
జిల్లాలో 21 ప్రాథమిక పాఠశాలల గుర్తింపు...
కార్పోరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేపట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యార్థులకు కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తోంది. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్త మయ్యారు. జిల్లాలో మొత్తం...ప్రభుత్వ పాఠశాలల్లో...మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఇందులో 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద 21 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో చదివే పది మంది విద్యార్థులను ఒక గ్రూపుగా చేసి వారికి ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన కంప్యూటర్ కేటాయిస్తారు ఇలా పాఠశాలలో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని కంప్యూటర్లు మంజూరయ్యే అవకాశం ఉంది. కాగా ప్రతీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కనీసం 3-5 కంప్యూటర్లు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థి స్థాయికి తగిన బోధన...
ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో సాధారణ బోధన కాకుండా విద్యార్థులు ఇష్టంగా చదువుకునేందుకు కంప్యూటర్ బోధన దోహదపడుతుం దని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి వారికి ఇష్టమైన అంశాలను తీసుకొని బోధించేందుకు కంప్యూటర్ శిక్షణ దోహపడుతుంది.
అయితే ఇందుకోసం కంప్యూటర్ నాలేడ్జ్ ఉన్న ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల చదువులో వెనకబడిన విద్యార్థులు కూడా కనీస సామర్థ్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఈ వేసవిలో పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం నుంచే పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పేందుకు సిద్దమవుతున్నారు.
మెరుగైన విద్యాబోధన...రాధాకిషన్, జిల్లా విద్యాధికారి, మెదక్
ఇప్పటికే ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బోధన ప్రారంభించాం. ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్ల మంజూరుకు జాబితా సిద్దం చేశాం. దీంతో మరింత మెరుగైన విద్యా బోధన అందించే అవకాశం ఉంది. మున్ముందు కూడా 50 కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలను కూడా ఎంపిక చేస్తాం. వారంలో రెండు తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాం.
జిల్లాలో వివరాలు ఇలా...
ప్రాథమిక పాఠశాలలు ః 628
విద్యార్థులు ః 25,700
ప్రాథమికోన్నత పాఠశాలలు ః 128
విద్యార్థులు ః 9006
ఉన్నత పాఠశాలలు ః 146
విద్యార్థులు ః 30,113
మొత్తం పాఠశాలలు ః 902
మొత్తం విద్యార్థులు ః 64,819