calender_icon.png 1 April, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్బంధ ఉచిత విద్య ఎప్పటికి?

29-03-2025 12:00:00 AM

పనుల ఒత్తిడివల్ల మా చిన్న కుమారుని ఇంటికి వెళ్లక చాలా రోజులైంది. వాడికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు 6వ తరగతి చదువుతుంటే, చిన్నకూతురు 2వ తరగతి చదువుతున్నది. నేను వెళ్లేటప్పటికి చిన్నమ్మాయి ఏడుస్తూ ఉంది. నన్ను చూడగానే నా నడుమును చేతులతో చుట్టేసి“తాతయ్యా! తాతయ్యా!! సిక్స్‌టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వవా?” అని అడిగింది. ఇంగ్లీషు మీడియంలో చదువుతుంది కదా! తెలుగు అంకెలు స్కూళ్లో ఎవరు నేర్పుతారు? ప్రతి తెలుగు మాటకు ఇంగ్లీషు పదాన్ని జోడించి చెప్పడం ఇంగ్లీషు పాఠశాలల్లో చదివే తెలుగు పిల్లలకు బాగా అలవాటైంది. 

“సిక్సిటీన్ హెండ్రెడ్ ఎందుకురా?” అని మా బాబును అడిగాను. వాడు సమాధానం చెప్పేలోపే మా మనవరాలు “తాతయ్యా! యాన్‌వెల్ డే ఫంక్షన్. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది..” అంది. 

‘డ్యాన్స్ ప్రోగ్రాంకు పదహారు వందల రూపాయలకు ఏమిటి సంబంధం?’ నాకు అర్థం కాలేదు. బాబును అడిగాను. 

“స్కూళ్లో డ్యాన్స్ నేర్పించారు. డ్యాన్స్ చేయాలంటే దానికి తగినట్లు డ్రెస్సు ఉండాలట. ఫంక్షన్‌లో పిల్లలు ఒకే డ్రెస్సులో ఉండి డ్యాన్స్ చేయాలట. ఆ డ్రెస్సుకు పదహారు వందలు అడుగుతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఏడ్చి అయినా తీసుకొని రావాలని పిల్లలకు కఠినంగా ఆజ్ఞాపించారట. స్కూల్ నుంచి రాగానే ఏడుస్తుంటే, చిరాకు వేసి వాళ్ల అమ్మ నాలుగు అంటించింది. దాంతో దాని ఏడ్పు ద్విగుణీకృతమైంది. ఈలోగా మీరు వచ్చారు..” అన్నాడు మా చిన్నబ్బాయి. 

“ఫంక్షన్ ఎప్పుడుంది?” అని అడిగాను. 

“మూడు రోజుల తర్వాత..” అన్నాడు మా వాడు. “సరే. ఈ మూడు రోజులు అమ్మాయిని బడికి పంపకురా” అన్నాను. ఈ ఆలోచన మా వాడికి కూడా నచ్చింది. 

ప్రైవేట్ స్కూళ్ల వాళ్లు ఫీజుల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉన్నవాళ్లు కట్టగలరు కాని లేనివాళ్ల సంగతేమిటి? పాఠశాలలు కేవలం చదువు చెప్పడానికే లేనట్టున్నాయి. పిల్లల్ని ఆటపాటల్లో పాల్గొనేటట్లు చేయడంలో తప్పు లేదు. కాని, ‘సంవత్సరానికి ఇంత ఫీజు’ అని వసూలు చేశాక మళ్లీ ఏడాది పొడవునా దానికింత, దీనికింత అని తల్లిదండ్రుల నుంచి డబ్బులు లాగడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడం వల్ల ప్రైవేట్ పాఠశాలలు విజృంభించాయి. ప్రైవేట్ పాఠశాలలు జంటనగరాల్లో వాడకొకటి ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. ఎవరు పాఠశాలలను స్థాపిస్తున్నారో వారిలో నూటికి తొంభై శాతం మందికి ఇంగ్లీషు రాదు. బాగా ఇంగ్లీషులో అదరగొట్టే వారిని ప్రిన్సపాల్స్‌గా నియమించి యాజమాన్యం పబ్బం గడుపుకోవడం సామాన్యంగా జరిగే పని. ప్రైవేట్ పాఠశాలల మీద ప్రభుత్వానికి చాలాకాలం నుంచి నియంత్రణ లేదు. ప్రైవేట్ యాజమాన్యం ‘ఆడింది ఆట, పాడింది పాట’. వాళ్ల ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తారు. స్కూల్ డే, కల్చరల్ డే, స్పోర్ట్స్ డే అంటూ మధ్యమధ్యన డబ్బులు వసూలు చేయడం అన్యాయం.

విద్యావ్యవస్థ బాగుకు పెద్ద అవరోధం

విద్యాలయం అంటే విద్యకు ఆలయం. కానీ, ‘ఎక్కడ విద్య లయమైందో అదే విద్యాలయం’ అనిపిస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు నిర్బంధంగా చదువుకోవాలి. 10+2 వారికి ఉచితంగా అక్కడి ప్రభుత్వాలు విద్య నేర్పుతాయి. మన దౌర్భాగ్యం ఏమంటే స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన పిల్లలకు ప్రభుత్వాలు ఉచిత విద్యను అందించలేక పోయాయి. చిత్రమేమంటే ఎన్నికల్లో గెలవడానికి ఉచిత పథకాలు ఎన్నైనా ప్రవేశపెడుతారు గాని పిల్లలకు కనీసం 10వ తరగతి వరకైనా ఉచిత విద్యను అందించక పోవడం శోచనీయం. కనీసం విద్యా సంబంధ అవసరాలు తీర్చక పోవడం ప్రజాస్వామ్య దేశంలో ఒక విధంగా లోపమే.

సమాజంలో కేవలం ధనవంతులే ఉండరు. వీరి శాతం ఎపుడైనా తక్కువే. ఐతే, ధనవంతుల పిల్లలతో సమానంగా పేదపిల్లలు ఫీజులు చెల్లిస్తేనే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం లభిస్తుంది. ఉచిత పథకాలు పక్కన పెట్టి ఉచిత వైద్యం, ఉచిత విద్య మొదలైన సౌకర్యాలను కల్పిస్తే ప్రభుత్వాలకు కూడా మంచిపేరు వస్తుంది. లేకపోతే, ప్రైవేట్ పాఠశాల వారు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి, ఫీజుల రూపంలో ప్రజాధనాన్ని దోచుకుంటారు. 

నేనున్న బోడుప్పల్‌లో వందల ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటిలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేసే సౌకర్యం లేదు. చదువు చెప్పే అధ్యాపకులకూ అరకొర జీతాలు. పేరుమోసిన ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు జీతాలు బాగా ఇస్తారని ప్రతీతి. కాని, వారు వసూలు చేసే ఫీజులను గమనిస్తే వెనుకటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన మావంటి వారికి తల తిరిగి పోతుంది. ‘కలియుగ మహిమేమో’ అనిపిస్తుంది. ఈనాటి చదువులకు, ఉద్యోగాలకు పొంతన లేదు. అందరికీ చదువు రావాలి కాని, అందరికీ ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? పిల్లల చదువు మాట దేవుడెరుగు, కాని ఫీజులే భరించలేకుండా ఉన్నాయి. విద్యాభివృద్ధికంటే పాఠశాలల భవనాల అభివృద్ధి, స్వీయాభివృద్ధిని కాంక్షించే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నంత కాలం ఈ పరిస్థితి మన విద్యావ్యవస్థకు అవరోధమనే చెప్పాలి. “నా మనవరాలు డ్యాన్సులో పాల్గొన జాలదని” నేనే పాఠశాల వారికి ఫోన్‌లో చెప్పవలసి రావడం, మంచిది కాకపోవచ్చు కాని అట్లా చేయకుండా ఉండలేకపోయాను.

 వ్యాసకర్త: ఆచార్య మసన చెన్నప్ప, సెల్: 9885654381