23-03-2025 12:00:00 AM
గర్భధారణ నుంచి ప్రసవం వరకు రోజుకో అనుభవం. ఆ బిడ్డని ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరుజన్మనే ఎత్తుతుంది అమ్మ. అయినా ఆమె మనసులో తెలియని ఆనందం. కాని ప్రెగ్రెన్సీ సమయంలో ఎన్నో సందేహాలూ పుట్టుకొస్తుంటాయి. ఏవేవో అనుమానాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. తొలిసారి గర్భం ధరించినవారికైతే మరీ ఎక్కువ. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలి? ఏయే పరీక్షలు చేయించుకోవాలి? ఇలాంటి అనుమానాలెన్నో కలవరపెడతాయి. ఈ నేపథ్యంలో గర్భిణులకు అవసరమైన పరీక్షలపై సమగ్ర సమాచారం..
ఫలదీకరణ, గర్భదారణ, కాన్పు సహజంగా జరిగే ప్రక్రియలే. అయితే ఇవి అందరికీ అంతే సవ్యంగా సాగుతాయని చెప్పలేం. గర్భం ధరించినప్పుటి నుంచి కాన్పు పూర్తయ్యే వరకూ ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తొచ్చు. తల్లికి రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తే బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపొచ్చు. వీటి విషయంలో అప్రమత్తత ఎంతైన అవసరం. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
ఇన్‌ఫెక్షన్ పరీక్షలు
హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెచ్‌పీవీ, సుఖవ్యాధులను నిర్ధరించే పరీక్షలూ ముఖ్యమే. తల్లికి ఇలాంటి జబ్బులుంటే బిడ్డకూ సక్రమించే అవకాశముంది. కాన్పు చేసే డాక్టర్, నర్సులకూ ప్రమాదమే. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా చూసే మందులు ఉన్నాయి. తల్లికి హెపటైటిస్ బి ఉంటే పుట్టగానే బిడ్డకు టీకా ఇవ్వాలి.
గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్ష
మనదేశంలో మధుమేహం చాలా ఎక్కువ. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా మధుమేహం రావొచ్చు. మూడో నెలలోపే ఒకసారి రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయిస్తారు. అప్పటికే గ్లూకోజు ఎక్కువగా ఉంటే ముందు నుంచే మధుమేహం ఉందని అర్థం. కొందరికి గర్బధారణ సమయంలోనే మధుమేహం మొ దలవ్వచ్చు. కాబట్టి ఐదోవ నెలలో గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్ష చేస్తారు.
రక్తం గ్రూపు
కాన్పు సమయంలో రక్తస్రావమయ్యే అవకాశముంది. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. కాన్పు బాగానే అవుతుందని అనుకున్న సందర్భాల్లోనూ హఠాత్తుగా రక్తస్రావం కావొచ్చు. అలాంటప్పుడు రక్తం అందుబాటులో ఉండాలి. ఏబీ పాజిటివ్, ఏబీ నెగెటివ్ గ్రూపు రక్తం చాలా అరుదు. అప్పటికప్పుడు దొరక్కపోవచ్చు. ముందే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల రక్తం గ్రూపు తెలుసుకుని ఉండటం ఎంతైనా అవసరం. నెగెటివ్, పాజిటివ్ గ్రూప్‌లకు పడదు. మాయలోంచి కొన్ని రక్తకణాలు గర్భిణి రక్తంలో కలుస్తుంటాయి. వీటి ద్వారా యాంటీబాడీలు తయారవుతాయి.
ఇవి తేలికగా మాయలోంచి బిడ్డకు చేరుకుని, రక్తకణాలను దెబ్బతీస్తాయి. వీరికి 7వ నెలలో ‘యాంటీ డీ గామా గ్లాబులిన్’ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తల్లి రక్తంలో కలిసే ఆర్‌హెచ్ పాజిటివ్ రక్తం కణాలను చంపుతుంది. యాంటీబాడీలు తయారు కాకుండా కాపాడుతుంది. కాన్పు తర్వాత బిడ్డ రక్తం గ్రూపునూ పరీక్షించాల్సి ఉంటుంది. బిడ్డ రక్తం ఆర్‌హెచ్ పాజిటివ్‌గా ఉన్నట్టయితే తల్లికి మరోసారి ‘యాంటీ డీ గామా గ్లాబులిన్’ ఇంజెక్షన్ ఇస్తారు. దీన్ని 24 గంటల్లోపే ఇవ్వాల్సి ఉంటుంది.
క్రియాటిన్
దీంతో కిడ్నీ పనితీరు తెలుస్తుంది. మామూలుగానే గర్బధారణ సమయంలో కిడ్నీలకు ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. దీంతో క్రియాటిన్ మోతాదులు చాలా తక్కువగా ఉంటాయి. కాన్పు తేదీ దగ్గర పడుతున్నప్పుడు దీని మోతాదులు రెట్టింపు అయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఎక్కువ.
హెచ్‌పీఎల్‌సీ పరీక్ష
థలసీమియా దీనికి కారణమయ్యే జన్యువు ఉన్నా పైకి లక్షణాలేవీ ఉండవు. కాని ఇది వీరి నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీన్ని గుర్తించడానికి తొలి త్రైమాసికంలో హెచ్‌పీఎల్‌సీ పరీక్ష చేస్తారు.
హిమోగ్లోబిన్
ఇది అన్నింటికన్నా అతి ముఖ్యమైన పరీక్ష. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లేది హిమోగ్లోబినే. తల్లికిది తగ్గితే బిడ్డకు ఆక్సిజన్ అందటం పడిపోతుంది. ఎదుగుదల దెబ్బతింటుంది. జన్యుపర మైన మార్పులూ తలెత్తొచ్చు. బిడ్డ ఎదగాల్సినంతగా పెరగకపోతే పెద్దయ్యాక అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల ముప్పు ఎక్కువవుతుంది కూడా (ఫీటర్ ప్రోగ్రామింగ్ ఫర్ అడల్ట్ డిసీజెస్). అందువల్ల గర్భధారణ జరిగినట్టు తెలియగానే హిమోగ్లోబిన్ పరీక్ష చేయడం తప్పనిసరి. సాధారణ గర్భిణులకు హిమోగ్లోబిన్ మోతాదులు 11 గ్రాములు ఉండాలి. ఏ మాత్రం తగ్గినా మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
థైరాయిడ్
బిడ్డ మెదడు ఎదుగుదలకు థైరాయిడ్ హార్మోన్ చాలా ముఖ్యం. తొలి 12 వారాల్లో ఇది ఉత్పత్తి కాదు. తల్లి నుంచే అందాలి. కాబట్టి గర్బధారణ నిర్ధరణ కాగానే థైరాయిడ్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తిని టీఎస్‌హెచ్ ప్రేరేపిస్తుంది. దీని మోతాడు ఒక వారాల్లోపు 2.5 కన్నా తక్కువుండాలి.
స్కానింగ్
మారుమూల ప్రాంతాల్లో స్కానింగ్ సదుపాయాలు అంతగా అందుబాటులో ఉండవు. కాబట్టి ఐదో నెలలోపు కనీసం ఒకసారైనా గర్భిణికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతున్నది. పిండంలో ఏవైనా లోపాలు ఉంటే బయటపడతాయి. నిజానికి మామూలుగానైతే గర్బధారణ సమయంలో ఐదు సార్లయినా స్కానింగ్ అవసరమవుతుంది. గర్భం దాల్చినట్టు తేలితే 10 వారాల్లో స్కానింగ్ చేయడం మంచిది. దీన్నే ‘ఎర్లీ ప్రెగ్రెన్సీ స్కాన్’ అంటారు. ఇందులో పిండం తల నుంచి పిరుదుల వరకు పొడవును బట్టి కాన్పయ్యే తేదీని అంచనా వేస్తారు. కాన్పు తేదీని తెలుసుకోవడానికిదే ప్రామాణికం.
ఎర్లీ టిఫా స్కాన్: దీన్ని 12 వారాల మధ్యలో చేస్తారు. పిండంలో ఏమైనా లోపాలు తలెత్తుతున్నాయా? గర్భిణికి మున్ముందు అధిక రక్తపోటు వచ్చే అవకాశముందా? అనేవి ఇందులో తెలుస్తాయి.
లేట్ టిఫా స్కాన్: దీన్ని 5వ నెలలో (19 వారాల మధ్యలో) చేస్తారు. ఏవైనా లోపాలుంటే చాలావరకు ఈ తొలి, మలి టిఫా స్కాన్లతోనే బయటపడతాయి. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో అన్ని లోపాలు, సమస్యలు తెలుస్తాయని చెప్పలేం. కొన్ని గుండె సమస్యలు, వెన్ను లోపాల వంటివి 7,8 నెలల్లోనే బయటపడుతుంటాయి. ఆటిజమ్, సెరిబ్రల్ పాల్సీ వంటి మానసిక సమస్యలు స్కానింగ్‌లో తెలియవు.
గ్రోత్ స్కాన్: దీన్ని 28 వారాల మధ్యలో చేస్తారు. ఇందులో బిడ్డ ఎదుగుదల తీరు తెన్నులు బయటపడతాయి.
30 దాటితే..
నిజానికి చాలామంది గర్భం దాల్చిన తర్వాతే జాగ్రత్తల గురించి ఆలోచిస్తుంటారు. గర్భధారణకు ముందే ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి అవగానే పిల్లల్ని కనాలని అనుకోవడం మంచిదే కావచ్చు. కాని ఇప్పుడు కాలం మారిపోయింది. భర్త ఒకచోట, భార్య ఒకచోట ఉద్యోగాలు చేస్తున్న రోజులివి. 37 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే కష్టమే. 30 దాటితే అండాల సంఖ్య తగ్గుతుంది. లేటు వయసులో పిల్లలను కంటే పుట్టబోయే బిడ్డకు (డౌన్ సిండ్రోమ్) వంటి జబ్బులు వస్తాయి. కాబట్టి 21 ఏళ్ల మధ్యలో గర్భం దాల్చడం ఉత్తమం. ఈ సమయంలో అండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫలదీకరణ బాగా జరుగుతుంది.
డాక్టర్ అలకనంద, గైనకాలజిస్ట్
శ్రీ సత్య ల్యాపరరోస్కోపి హాస్పిటల్
నాచారం, హైదరాబాద్