బీసీలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): బీసీలకు న్యాయం చేయడా నికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కులగణన సర్వే వివరాలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్‌బాబు.. బీసీలకు న్యాయం చేయాలన్న ఆకాంక్షతో తమ ప్రభుత్వం అడుగు ముందు కెళ్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎవరు తొలగించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చి తొలగించిందా? అని నిలదీశారు. అంతకుముందు గతం లో బండారు దత్తాత్రేయను బీజేపీ విస్మరించిందని ఆరోపించారు.
అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో చేసిన సర్వేపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం చేసిన సర్వేకు శాస్త్రీయత ఎక్కడుందని ప్రశ్నించారు. అప్పటి నివేదికను మంత్రివర్గంలో కానీ, అసెంబ్లీలో కానీ ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు.