- గవర్నర్ వివరాల నమోదుతో లాంఛనంగా ప్రారంభం
- స్టిక్కర్ అతికించిన ఇళ్లకు వెళ్లి వివరాల సేకరణ
- మినిస్టర్ క్వార్టర్స్‌లో పాల్గొన్న మంత్రి పొన్నం
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు స్టిక్కర్లు అంటించిన ఇళ్లకు వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. అక్కడక్కడ తప్పితే మొదటి రోజు సర్వే సాఫీగానే సాగింది.
ప్రజలు తమ ఇళ్లకు వచ్చిన ఎన్యుమరేటర్లు అడిగిన వివరాలను ఇచ్చారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి క్షేతస్థాయి వరకు సమగ్ర సర్వేను పర్వవేక్షించారు. కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి.. క్షేతస్థాయిలో సర్వే పరిస్థితిని ఆరాతీశారు. ఈ సర్వే ఈ నెల 21వరకు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించగా.. అప్పటిలోపు పూర్తికాకపోతే గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగించే అవకాశం ఉంది.
75 ప్రశ్నలతో కూడిన షీట్‌లో మొత్తం 243 కులాలకు సంబంధించిన కోడ్స్ షీట్‌ను సిద్ధం చేసి ఎన్యుమరేటర్లకు ఇచ్చింది. ఆ కోడ్ల ఆధారంగా కులాలను షీట్‌లో నమోదు చేయనున్నారు. వాస్తవానికి శుక్రవారం నాటికి ఇళ్లకు స్టిక్కరింగ్ పూర్తికావాల్సి ఉంది. కానీ, హైదరాబాద్‌లో 96 శాతం మాత్రమే జరగడంతో మిగిలిన స్టిక్కరింగ్ పనిని శనివారం పూర్తి చేశారు. సిటీలోని పలు ప్రాంతాల్లో సర్వే ఆలస్యంగా ప్రారంభమైంది.
సర్వేలో పాల్గొన్న గవర్నర్
రాష్ట్రంలో సర్వేను శనివారం ఉదయం తొలి పౌరుడు గవర్నర్‌తో ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మరో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హైదరా బాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ శబరీష్‌తో ఎన్యుమరేటర్లు, ప్లానింగ్ అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వివరాలను నమోదు చేసుకున్నారు.
ప్రజలందరూ సహకరించాలి: మంత్రి పొన్నం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్వేలో భాగంగా శనివారం బంజారాహిల్స్ మినిస్టర్స్ కాలనీలోని పొన్నం ప్రభాకర్ నివాసంలో ఎన్యూమరేటర్లు మంత్రి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ అవకాశాలను మెరుగు పరుచుటకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నట్టు వివరించారు. ఎన్యుమారేటర్లు సర్వే చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.