calender_icon.png 9 January, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనొవా కాన్సర్ ఆస్పత్రిలో సంక్లిష్ట శస్త్రచికిత్స

03-01-2025 02:22:15 AM

ఆస్పత్రి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆజాద్ చంద్రశేఖర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ 40 సంవత్సరాల చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఎంతో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను 10 నుంచి 12 గంటలపాటు శ్రమించి తమ వైద్య బృందం విజయవంతంగా పూర్తిచేయడం సంతోషంగా ఉందని ఆ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యూ ఆజాద్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా గుత్ప గ్రామానికి చెందిన గుమ్మల సాయన్న అనే వ్యక్తి సంవత్సరం నుంచి ముఖంలో వాపు, కుడి దవడ దగ్గర పెద్ద కణితి (10ఎంఎం సైజు) ఏర్పడి కంట్లో నుంచి నీరు కారడం, మింగడానికి కూడా ఇబ్బంది పడేవారని వివరించారు.

చికిత్స కోసం సాయన్న కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించగా, మాక్సిల్లరీ సైనస్ కార్సినోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసిందని చెప్పారు. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిందేనని తెలియడంతో చికిత్స కోసం నిజామాబాద్, హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌ను ముందుగా సంప్రదించారని తెలిపారు.

సాయన్న సంవత్సరం కాలంగా సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి బాగా ముదిరి ఉన్నందున చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్పాయని పేర్కొన్నారు. కానీ పేషెంట్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ వద్ద సాధ్యమైనంతవరకు తక్కువ ఖర్చుతో ఎక్కడా రాజీ లేకుండా చికిత్స అందించడం జరిగిందని చెప్పారు.

ఈ సందర్భంగా ఈ విజయంలో తనకు పూర్తిస్థాయి లో సహకారం అందించిన వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బందిని అభినందించారు. ఈ సర్జరీ బృందంలో తనతోపాటు డాక్టర్ రాకేశ్ శంకర్‌గౌడ్, క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ రవికుమార్‌రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ రాకేశ్‌కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ ఉల్లాస్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ శ్రీనాథ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, డాక్టర్ సమంత్, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్, డాక్టర్ మధుసూదన్‌రావు, మెడికల్ సూపరింటెండెంట్, శ్రీమతి శ్రీవల్లి, సెంటర్ హెడ్ ఉన్నట్టు తెలిపారు.