03-04-2025 11:35:24 PM
180 రోజులుల్లో 3,185 కిలోమీటర్ల పైపులైన్, 2.50 లక్షల మ్యాన్ హోళ్లలో సిల్ట్ తొలగింపు..
సమష్టి కృషి వల్లే మంచి ఫలితాలు.. ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలోని సీవరేజీ ఓవర్‌ఫ్లో ఫిర్యాదులను తగ్గించేందుకు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని హైదరాబాద్ జలమండలి ప్రతిష్ఠాత్మకంగా రెండో సారి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ముగిసింది. గతేడాది అక్టోబర్ 2 నుంచి నిర్విరామంగా 180 రోజుల పాటు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌తో ఇప్పటివరకు 24,146 ప్రాంతాల్లో 3,185 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్‌ను, 2.50 లక్షల మ్యాన్ హోళ్లలో సిల్ట్‌ను తొలగించినట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. మొదట 90రోజుల పాటు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ గతేడాది డిసెంబర్‌తో ముగియగా సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు మరో మూడు నెలలు కొనసాగించామన్నారు.
వర్షాకాలం నాటికి సీవరేజీ పైప్‌లైన్, మ్యాన్‌హోళ్లలో వ్యర్థాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. సమష్టి కృషి వల్లే మంచి ఫలితం వచ్చిందని, ఈ స్పెషల్ డ్రైవ్ ఫలితంగా రోజూ వచ్చే సీవరేజ్ ఫిర్యాదులు 20 నుంచి 30 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి తో జున్ నాటకీ మిగతా మాన్ హోల్ ళ్లు కూడా డీ సిల్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ పనుల్ని రోజూవారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్ లో నమోదు చేయడం గమనార్హం.