calender_icon.png 8 January, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయండి

06-01-2025 03:37:29 PM

వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ రోజు (96) దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలని, ఇప్పటికే సర్వే చేసిన వివరాల్లో రూఫ్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలని అన్నారు.

ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, దివ్యంగుల లబ్ధిదారులకు పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్లు వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇండ్ల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేయాలని అన్నారు. గత వేసవి కాలంలోని సమస్యలు దృష్టిలో ఉంచుకొని వచ్చే వేసవిలో త్రాగు నీటి సమస్యలు రాకుండా అద్దె బోర్లు పరిశీలించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని, మురికి కాల్వల్లోని చెత్తను తొలగించాలని, మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని తెలిపారు. వేసవిలో మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలన్నారు.

ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయాలనీ తెలిపారు. నర్సరీల్లో మొక్కలను వందశాతం సంరక్షించాలని తెలిపారు. డ్రై డే ఫ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు వారి క్షేత్ర పర్యటనలో అన్ని అంశాలపై సమీక్షించాలని, పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.