23-02-2025 06:37:18 PM
సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...
మందమర్రి (విజయక్రాంతి): యోగాసనాలు సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను దినచర్యగా పాటించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ కోరారు. డ్రీమ్ యోగ అండ్ ఫిట్ నెస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగా వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడమే కాకుండా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని ఒక వ్యక్తి దృఢంగా ఉన్నప్పుడే కుటుంబం బాగుంటుందనీ తద్వార గ్రామం, పట్టణం, దేశం కూడా బాగుపడుతుందని అన్నారు.
పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు విద్యార్థులకు యోగా శిక్షణ కోసం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అఖండ జ్యోతి వెలిగించి కాగడాతో రన్ నిర్వహించగా అతిథులు, నిర్వాహకులు, పోటీదారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో హైదరాబాదు నుండి విచ్చేసిన నిష్ణాతులైన న్యాయ నిర్ణేతల సమక్షంలో 30 జిల్లాల నుండి విచ్చేసిన యోగా సాధకులు 8 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల పైబడిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనగా పోటీలలో పాల్గొన్న వారిని 14 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు.ఈ యోగ పోటీలలో సూర్య నమస్కారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో డ్రీమ్ యోగా అండ్ ఫిట్ నెస్ సెంటర్ ఫౌండర్ టోర్నమెంట్ నిర్వాహకులు ముల్కల శంకర్, ఆల్ ఇండియా యోగ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్, తెలంగాణ యోగ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రవికుమార్, యోగా థెరపిస్ట్ సత్యరెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి కనపర్తి రమేష్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, యోగ మాస్టర్లు ,బర్ల సదానందం, కొంపెల్లి రమేష్, బడికల సంపత్, మద్ది శంకర్, లయోల కుమార్, ఎగ్గేటి రాజేశ్వరరావు, పోలు సంపత్, ఎగ్గేటి రాజమౌళి, డిఎస్ రావు, ముల్కల్ల సాయి లు పాల్గొన్నారు.