-జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, విజయక్రాంతి: పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంత మురికివాడలోని 5 సంవత్సరాలలోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో "పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమం"పై నిర్వహించిన వర్క్ షాప్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 5 సంవత్సరాల లోపు పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, యుక్త వయసు బాలికలకు వివిధ రకాల పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ నేటికి గ్రామీణ ప్రాంతాలలో 5 సంవత్సరాలలోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా తీవ్ర ,అతి తీవ్ర పోషణ లోపం, బరువు తక్కువగా ఉండడం, వయసుకు తగిన బరువు లేకపోవడం వంటి కారణాలతో అనేకమంది చిన్నారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం "పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ,దీంట్లో భాగంగా 5 సంవత్సరాల లోపు పిల్లల పోషణ ,ఆరోగ్యం, పరిశుభ్రతలపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.
పౌష్టికాహార లోపం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఆరోగ్యం, పౌష్టికాహారం 2 చాలా ముఖ్యమైనవి అని ప్రత్యేకించి మానవ జీవితంలో 5 సంవత్సరాలలోపు వయస్సు అత్యంత కీలకమైనదని, వారి భవిష్యత్తు ఆరోగ్యం పౌష్టికాహారం పైనే ఆధారపడి ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగశాఖ, ఐసీడీఎస్ లు సమన్వయంతో పనిచేసి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంత మురికివాడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి, పౌష్టికాహార కార్యక్రమాన్ని చూసి ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారని తెలిపారు .రాష్ట్రంలో అమలు చేస్తున్న బాలామృతం చిన్నపిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తుందన్నారు. ప్రతినెల మొదటి తేదీన తీవ్ర, అతి తీవ్ర పోషన లోపంతో బాధపడుతున్న వారు ,అలాగే బరువు తక్కువ, వయసుకు తగిన బరువు లేకుండా ఉన్న పిల్లల బరువు పెరుగుదలను పర్యవేక్షించాలని ,వారి బరువులను క్రమం తప్పకుండా రికార్డు చేయాలని అన్నారు.
వచ్చే నెల నుండి జిల్లా,మండల స్థాయి అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల పెరుగుదల నమోదు సక్రమంగా జరుగుతున్నది లేనిది పర్యవేక్షించాలని చెప్పారు. అంతేకాక వారి వివరాలను రికార్డు చేస్తున్నది లేనిది దగ్గరుండి పరిశీలించాలని అన్నారు. అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడే పిల్లల ఇంటికి వెళ్లి వారి పౌష్టికాహారం తనిఖీ చేయాలని, వారు పౌష్టికాహారం వాడుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌష్టికాహారం పై రూపొందించిన గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం "పిల్లలు పౌష్టికాహారం లోపంతో బాధపడకుండా రక్షించుకుంటామనే" ప్రతిజ్ఞను చేయించారు. జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మ మాట్లాడగా, రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ కన్సల్టెంట్ రాహుల్ "పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకార కార్యక్రమం "పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి పద్మజ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.