30-04-2025 12:41:43 AM
* పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే విషయంలో అనుసరించే పద్ధతులు, లక్ష్యాలు, సరైన సమయాన్ని నిర్ణయించే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఉగ్రవాదం అణచివేతే దేశ సంకల్పం. భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.
ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : పహల్గాం ఉగ్రదాడి నిందితులపై చర్యలు తీసుకునే క్రమంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మంగళవారం న్యూఢిల్లీ లోని ప్రధాని నివాసంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్‌లతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో జరిగింది. ఉగ్రవాదం అణచివేతే దేశ సంకల్పమని మోదీ ఉద్ఘాటించినట్టు తెలుస్తోంది. భారత త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలపై ప్రధాని విశ్వాసం వ్యక్తంచేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే విషయంలో అనుసరించే పద్ధతులు, లక్ష్యాలు, సరైన సమయాన్ని నిర్ణయించే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పహల్గాం దాడి నిందితులను శిక్షిం చేందుకు భద్రతా బలగాలు చూస్తున్న వేళ జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితుల గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.
తాజాగా ప్రధాని మోదీ నిర్వహించిన మన్‌కీబాత్‌లో కూ డా ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రదాడి నిందితులు, ఉగ్రదాడి వెనకున్నవారికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ప్రధాని హామీనిచ్చారు. ఈ భేటీకి ముందు యూనియన్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ పారామిలటరీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.