- ఎస్సీల్లో చేర్చాలన్న వడ్డెర, రజక, గంగపుత్ర కులాలు
- ఎస్టీల్లో చేర్చాలని సగర (ఉప్పర)ల వినతి
- బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): బీసీల సమస్యలు, బీసీ సంఘాలు, నాయకుల సూచనలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో బీసీల స్థితిగతులపై జరిగిన బహిరంగ విచారణలో పాల్గొని వివిధ బీసీ కులాలు, సంఘాలకు చెందిన నాయకులు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను బీసీ కమిషన్ సభ్యులు, కలెక్టర్ అనుదీప్‌తో కలిసి స్వీకరించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో 95 వినతులు వచ్చాయి. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వారికి అందాల్సిన అవకాశాలు, తదితర అంశాలపై జిల్లాల వారీగా బహిరంగ విచారణ చేపట్టామన్నారు.
అనేక సమస్యలు బీసీ కమిషన్ దృష్టికి వచ్చాయన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి 9 జిల్లాలోని బీసీల స్థితిగతులపై కమిషన్ బహిరంగ విచారణ చేపట్టిందని చివరిగా హైదరాబాద్ జిల్లాలో విచారణను నిర్వహించామన్నారు. గతంలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల జీవన, ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవనంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు కూడా దరఖాస్తులు సమర్పించారని చెప్పారు. బీసీ జాబితాలోని వడ్డెర, రజక, గంగపుత్ర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని, బీసీలో ఉప్పరలను ఎస్టీ జాబితాలోకి మార్చాలని వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు. మరి కొన్ని కులాల పేర్లు తిట్టులాగా ఉండటంతో వారు ఆత్మన్యూనతగా భావిస్తున్నారని, తమ కులాల పేర్లను మార్చుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
సయ్యద్, పఠాన్, ఖాన్, మీర్జాలను బీసీ ఈ జాబితాలో చేర్చాలని దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. పలు కులాల ఫెడరేషన్ల ఏర్పాటు, బలోపేతం వంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లోనూ బీసీ కమిషన్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.