మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, హెచ్‌ఓడీలతో మేయర్.. ప్రజావాణి, మై జీహెచ్‌ఎంసీ యాప్, ఎక్స్ (ట్విట్టర్) ఆన్‌లైన్ ఫిర్యాదులపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ స్థాయిలో ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రారంభ దశలోనే ఫిర్యాదు వచ్చినట్లయితే ఎంక్వయిరీ, తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మై జీహెచ్‌ఎంసీ యాప్, ఎక్స్, ఆన్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, నళిని పద్మావతి, గీతారాధిక, స్నేహ శబరీష్, సుభద్రాదేవి, సత్యానారాయణ, వేణుగోపాల్ రెడ్డి, చంద్రాకాంత్ రెడ్డి, పంకజ, రఘు ప్రసాద్, అశోక్ సామ్రాట్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.