24-03-2025 05:19:34 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో ప్రజావాణి కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. సోమవారం పలు సమస్యలపై (131) దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటివరకు 20,370 దరఖాస్తులు రాగా, ఆయా శాఖల అధికారులు పరిశీలించి 19,567 దరఖాస్తుల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. 803 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని తెలిపారు, వాటిని వచ్చే వారం లోగా పరిష్కరించాలని కోరారు.
ధరణీ దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్క్ అవుట్ ఇవ్వాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీఓ లు, ఎంపీఒ లు పర్యవేక్షించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ... రేషన్ కార్డుల కొరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని రెవిన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎంపీడీఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ లు విచారణ చేయాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వీణ, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.