బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎంసిపిఐయు జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ వరంగల్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్ ఎం డి ఏ) కు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందించారు. బెల్లంపల్లిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, తహసిల్దార్ లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
బెల్లంపల్లిలో 170 పిపి భూములు సెల్లార్లకు, భారీ భవనాల నిర్మాణాలకు అనుమతులు లేవని ఆర్టిఐ వివరణ ఇచ్చినప్పటికీ మున్సిపల్ అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలకు అనుమతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పేదలు చిన్నపాటి షెడ్డు వేసుకుంటే తొలగించే అధికారులు పెద్దపెద్ద భవనాలకు ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఎండిఏ నుండి అనుమతులు పొందే భవన నిర్మాణాలు చేపడుతున్నామని పలువురు చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా బెల్లంపల్లిలో అక్రమ కట్టడాలను అరికట్టాలని కోరారు.