బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం, దుష్ప్రవర్తన కారణంగా బాలల హక్కులతో పాటు వారి సంక్షేమం ప్రమాదంలో పడిందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కు బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీ జనపథ్ లోని ఎన్.సి.పి.సి.ఆర్ కార్యాలయంలో సభ్య కార్యదర్శిని కలిసి సంద్య థియేటర్ ఘటనపై ఫిర్యాధు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. థియేటర్ మేనేజ్‌మెంట్ తగిన భద్రతను కల్పించడంలో, ప్రేక్షకుల కదలికలను నియంత్రించడంలో తగిన అత్యవసర వైద్య సహాయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని, ఇది తొక్కిసలాటకు దారి తీసిందన్నారు.
ఈ సంఘటన భారత రాజ్యాంగం, బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కింద హామీ ఇవ్వబడిన జీవితం, భద్రత హక్కు, ఆరోగ్య హక్కు, హాని నుండి రక్షణ హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణగా నిలిచిందన్నారు. ఈవెంట్ నిర్వాహకులు, థియేటర్ మేనేజ్‌మెంట్, నటుడు అల్లు అర్జున్ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. మాస్టర్ శ్రీ తేజ్ చికిత్స, పునరావాసం కోసం తక్షణ ఆర్థిక, వైద్య సహాయం కోసం ఏర్పాట్లు చేయడంతో పాటు అత్యున్నత స్థాయి సంరక్షణను నిర్ధారించాలని కోరామన్నారు. పబ్లిక్ ఈవెంట్‌ల సమయంలో భద్రత ప్రోటోకాల్‌ల గురించి పిల్లలకు, వారి కుటుంబాలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి నాయకులు ఆనంతుల రామ్మూర్తి గౌడ్, బడేసాబ్, రాఘవేందర్ గౌడ్, మహేందర్ నాయుడు, గౌతమ్ శంకర్ గౌడ్, దేవర శివ పాల్గొన్నారు.