మర్రి కాలేజీపై కూడా చర్యలు తీసుకోవాలె
కమిషనర్‌కు వజ్రేష్ యాదవ్ ఫిర్యాదు
మేడ్చల్, ఆగస్టు 30: మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వజ్రేష్ యాదవ్ వినతిపత్రం అందించారు. మేడ్చల్ మండలం నల్లకుంట చెరువు సర్వే నెంబర్ 33లో 13 ఎకరాల భూమిని ఆక్రమించుకుని సీఎంఆర్ మెడికల్ కళాశాలను నిర్మించారని, కోమటికుంట సర్వే నెంబర్ 647లో 20 ఎకరాల్లో మల్లారెడ్డి యూనివర్సిటీ, నీళ్ల చెరువు సర్వే నెంబర్ 428లో ఐదు ఎకరాల 30 గుంటలు కబ్జా చేశారని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 29లో14 ఎకరాలు కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారని తెలిపారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీ కూడా చెరువులో ఉందని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.