calender_icon.png 13 March, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బేరు ఎస్ఐ అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు

12-03-2025 09:50:29 PM

ల్యాండ్, రేషన్, ఇసుక మాఫియాలతో కుమ్మక్కు

మార్కెట్ గోదాం నిందితులకు అండగా పెబ్బేరు ఎస్సై

ఎస్సైపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి

బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

ముషీరాబాద్,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి(Pebbair SI Hariprasad Reddy) అవినీతి, అరాచకాలపై విచారణ జరిపి అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి బీసీ పొలిటికల్ జేఏసీ(BC Political JAC) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లక్డికాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్(JAC State Chairman Raja Yugandhar Goud) మాట్లాడుతూ... పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, రేషన్ మాఫియాలతో కుమ్మక్కై నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవల ఓ మహిళ మెడలో నుంచి బంగారం చోరీకి గురైందని... ఆ రికవరీ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసి కోర్టు ద్వారా బాధితులకు ఇవ్వాలి.. కానీ ఆయన దుర్బుద్ధితో కోర్టులో రూ.70వేలు మాత్రమే డిపాజిట్ చేసి మిగతాది లంచంగా తీసుకొని బాధితులకు ఫోన్ పే ద్వారా రూ.50వేలు ఒకసారి, రూ.30 వేలు మరొకసారి వేసి మమ అనిపించారని తెలిపారు. మరొక మహిళకు సైతం రూ.50వేలు ఫోన్ పే చేసినట్లు తెలిపారు.

ప్రధాన పత్రికలలో ఆధారాలతో సహా కథనాలు వచ్చినా జిల్లా ఎస్పీ కాని, ఐజీ కానీ చర్యలు తీసుకోవడం లేదని, అందుకే ఎస్సై అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఎస్ఐ అరాచకాలపై సాక్ష్యాధారాలు, బాధితులతో మాట్లాడిన కాల్ రికార్డింగులు, ఆయన మీద సేకరించిన అన్ని వివరాలను డీజీపీకి అందించడం జరిగిందని అన్నారు. ఎస్ఐ చాలా దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆఖరికి ఇనుప సామగ్రి విక్రయించే వారి నుంచి కూడా నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. దొంగల నుంచి రికవరీ చేసిన దాని నుంచి కూడా వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇసుక దందా, రేషన్ దందా అన్నిట్లలో ఆయనకు నెలకు వాటాలు ముట్టాల్సిందేనని, పెబ్బేరులో మార్నింగ్ వాక్ కార్యక్రమానికి వెళ్తే అనేకమైన ఫిర్యాదులు ఎస్సై పై వచ్చాయన్నారు.  చట్టం ప్రకారం మహిళ నిందితులను పట్టుకుంటే 24 గంటలలోపు పంపించాల్సి ఉంటుందని, కాని ఈ ఎస్సై ఏకంగా 8 రోజులు స్టేషన్లోనే ఉంచారని, ఎస్సైపై చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు రాఘవేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్, రేనట్ల మల్లేష్,ముత్యాల వినోద్ సాగర్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.