- ఏర్పాటు చేసి కంప్లయింట్లు స్వీకరించారి
- ఉన్నతాధికారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
- హైకోర్టు మార్గదర్శకాలు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కారాలయాల్లో ఫిర్యాదులు, వినతులు సమర్పించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా గతంలో జారీ చేసిన ఆదేశాలతో పాటు తాజా మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించా లని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు, వినతులను ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్, ఆపై ఉన్నతాధికారులు పరిశీలించి, అవసరమైతే విచార ణ జరిపి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలంది.
అంతేగాకుండా ఫిర్యాదులు చేసే వ్యక్తులు భవిష్యత్తులో పరిశీలన నిమి త్తం ఒక కాపీని తమ వద్ద ఉంచుకోవాలని సూచించింది. నిర్దిష్ట కాలవ్యవధిలో అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ పరిశీలన చర్యలు తీసు కోవాలని స్పష్టం చేసింది. ప్రజల్లో విశ్వాసం కల్పించడానికే మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లి మండలం కొండాపూర్‌లో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కేపీహెచ్‌బీకి చెందిన పీ రమ్యశ్రీ, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్టోబరు 11న ప్లాట్ రిజస్ట్రేషన్ చేయాలంటే సబ్‌రిజిస్ట్రార్, కార్యాలయం సి బ్బంది రిజిస్ట్రేషన్‌కు ముడుపులు డిమాండ్ చేశారన్నారు.
దీనికి సంబంధించి పిటిషనర్ ఫోన్లోని వాట్సాప్ సంభాషణను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు లక్ష్మణ్‌రెడ్డి, సాయితోపాటు డాక్యుమెంట్ రైటర్ రూ.2 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఆరోపణలు వాస్తవదూరమంటూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన సబ్‌రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు.
రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి దరఖాస్తు సమర్పించలేదని, డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టరాదన్నారు.. అంతేగాకుండా పిటిషనర్ చెబుతున్న అక్టోబరు 11న తాను సెలవులో ఉన్నానని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసానం కార్యాలయానికి వచ్చేవారి కోసం ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి వివరాలు తీసుకోవాలని ఐజీని ఆదేశించారు.
అంతేగాకుండా ప్లాటు రిజిస్ట్రేషన్ చేయడంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌రిజిస్ట్రార్-1పై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిటిషనర్ తాజాగా రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్ సమర్పించాలని, దీన్ని పరిశీలించి వారంలోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని జాయింట్ సబ్‌రిజిస్ట్రార్-1కు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 10వ తేదీకి వాయిదా వేశారు.