calender_icon.png 6 April, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శెట్టి చంద్రశేఖర్​పై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు

05-04-2025 03:57:46 PM

అక్రమ ఇసుక తరలింపుకు అడ్డుకుంటే బెదిరించి మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు 

రెవెన్యూ అసోసియేషన్ నేతలు

మూసాపేట్: గత రెండు రోజులుగా మూసాపేట్ మండలంలో ఓ కాంగ్రెస్ నాయకుడు రెవెన్యూ శాఖ సిబ్బందిని ఇష్టానుసారంగా తిట్ల పురాణం తో దూషించిన ఆడియో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటన జరిగి కొన్ని రోజులు గడిచినప్పటికీ ఆడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో ప్రచారం అయింది. ఈ విషయంపై విజయక్రాంతి దినపత్రిక శుక్రవారం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి నౌకరి చేయాలనుకుంటే ఎక్కువ చేయకు..? అనే కథనం ను ప్రచురితం చేసింది. ఈ విషయాలతో పాటు కథనం లో రాసేందుకు వీలుపడని పదజాలంతో శెట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి దూషించడం జరిగిందని మూసపేట్ మండల రికార్డ్ అసిస్టెంట్, నిజలాపూర్ గ్రామ ఇంచార్జ్ సీ చంద్రాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవెన్యూ అసోసియేషన్ నేతలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి(Collector Vijayendira Boi), జిల్లా ఎస్పీ డీ జానకి(SP Janaki Dharawat), మూసాపేట్ మండల పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి... కొన్ని రోజుల క్రితం నిజలాపూర్ గ్రామంలో ఇసుక తరలింపుకు మూసపేట్ తాసిల్దార్ పది ట్రిప్పులను అనుమతి ఇవ్వడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇసుకను తరలించాలని ఉత్తర్వులు జారీచేసిన పత్రంలో తాసిల్దార్ పేర్కొన్నారు. సమయం పూర్తి కావడంతో పాటు లెక్కకు మించి ఇసుక ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించి రికార్డు అసిస్టెంట్  నిజాలాపూర్ గ్రామ ఇంచార్జ్ చంద్రాయుడు నిబంధనల మేరకు ఇసుక తరలించాలని కోరారు. ఈ విషయంపై శెట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి మీరు ఎవరు ఇసుక తరలింపు ఆపడానికి..? మీ సంగతి చూస్తా..? తాసిల్దార్ కార్యాలయానికి రండి..? ఇలా అనేక అంశాలతో కూడిన రాసేందుకు ఉపయోగించ కూడని పదాలతో దూషించినట్లు రెవెన్యూ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఈ సమాచారం కూడా ఆడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ ఉద్యోగులను పూర్తిగా అవమానకరంగా మాట్లాడడం జరిగిందని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో రెవెన్యూ అసోసియేషన్ నేతలు ఘాన్సీరాం నాయక్, రాజీవ్ రెడ్డి, చంద్ర నాయక్, దేవేందర్, చంద్రాయుడు, తదితరులు ఉన్నారు.